తెలంగాణలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సహకార సంస్థలు, గోదాముల దగ్గర రైతులు బారులు తీరి ఎదురు చూస్తుంటే… అబ్బే, అలాంటి కొరత అస్సలు లేదని అంటోంది ప్రభుత్వం. గడచిన వారం రోజులుగా అన్నదాతల పడిగాపులు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూడు రోజులుగా దుబ్బాకలో యూరియా కోసం ఎదురుచూస్తున్న ఒక రైతు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై ప్రభుత్వానికి సానుభూతి లేకపోవడం ఒక దారుణమైతే, రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ రైతు మృతిపై చేసిన వ్యాఖ్యలు మరింత బాధాకరంగా ఉన్నాయి.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ… యూరియా లారీల్లో వచ్చిందనీ, ఓపక్క దించుతూ ఉన్నారనీ, ఓపక్క పంపిణీ జరుగుతోందనీ దాన్లో భాగంగా రైతులు లైన్లలో నిలబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. దురదృష్టవశాత్తు ఒక రైతుకి గుండెపోటు వచ్చిందన్నారు. ఆయన క్యూలైన్లో నిలబడటం యాదృచ్చికమనీ, అంతే తప్ప అది యూరియా కోసం కాదన్నారు. సినిమాహాళ్లు దగ్గర నిలబడతామనీ టిక్కెట్టు తీసుకునే లోపు ఏదైనా ఆపదైతే అది సినిమావాళ్ల తప్పు కాదన్నారు! మీటింగ్ వస్తే.. దురదృష్టవశాత్తూ ఏమైనా జరిగితే అది మీటింగ్ నిర్వహించినవాళ్ల తప్పు కాదన్నారు. కొన్ని యాదృచ్చికంగా జరుగుతుంటే వాటిని వేరే అంశాలకు ముడిపెట్టడం సరైంది కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
ఆయన చెప్పేది ఏంటంటే.. రైతు మృతికీ ప్రభుత్వానికీ, వ్యవసాయ మంత్రిగా తనకూ ఎలాంటి సంబంధం లేదని తప్పుకున్నారు. యూరియా కోసం రైతులు బారుల్లో నిలబడం యాదృచ్చికం ఎలా అవుతుంది..? ఈ కొరతకు కారణం ప్రభుత్వ వైఫల్యం కాదా..? యూరియా కొరత వల్లనే కదా రైతులు ఇవాళ్ల బారులు తీరి ఎక్కడిక్కడ పడిగాపులు కాస్తున్నది..? యూరియా స్టాక్ విషయంలో కొంత సరైన నిర్వహణ లేకపోవడమే ఈ తాత్కాలిక కొరత అని మంత్రి చెప్పుకొస్తున్నారు. వైఫల్యాన్ని చిన్నదిగా చేసి చూపుతున్నారు. అది చాలదన్నట్టు, ఒక రైతు గుండె ఆగి చనిపోతే.. వ్యవసాయ మంత్రిగా కనీస సానుభూతిని ప్రకటించకుండా, సినిమా టిక్కట్ల కోసం లైన్లలోనిలబడ్డవారితో పోల్చడం అనేది చాలామందికి ఆగ్రహం తెప్పిస్తోంది.