పవన్ కల్యాణ్ కి త్రివిక్రమ్ కలిస్తే.. అగ్నికి వాయివు తోడైనట్టే. అత్తారింటికి దారేదితోనే ఆ విషయం అందరికీ అర్థమైంది. అప్పటి వరకూ ఉన్న టాలీవుడ్ రికార్డులన్నింటినీ అత్తారింటికి దారేది బ్రేక్ చేసేసింది. ఇప్పుడు వీరిద్దరి నుంచి ‘అజ్ఞాత వాసి’ వస్తోంది. ఈ సినిమా కూడా రికార్డులు కొల్ల గొట్టడం ఖాయమని పవన్ ఫ్యాన్స్ ముందే లెక్కలు వేసుకుంటున్నారు. అందులో భాగంగా ఓ రికార్డు ఆల్రెడీ బద్దలైపోయింది. ఓవర్సీస్లో ఈ సినిమాని ఏకంగా 209 లొకేషన్లలో విడుదల చేస్తున్నారు. ఓ భారతీయ చిత్రం ఇన్ని చోట్ల విడుదల కావడం ఇదే తొలిసారి. బాహుబలి 2 – 126 కేంద్రాల్లో విడుదలైతే, ఖైది నెం.150… 74 లొకేషన్లలో విడుదలైంది. కబాలి 73 లొకేషన్లకే పరిమితం. దంగల్ 69 కేంద్రాల్లో విడుదలైంది. వాటన్నింటినీ అజ్ఞాత వాసి దాటుకెళ్లిపోయిందిప్పుడు. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ గిరాకీ ఉంటుంది. పైగా ఈ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదల అవుతోంది. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మరి ‘అజ్ఞాతవాసి’ ఏ స్థాయి వసూళ్లు అందుకుంటుందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.