ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. గత మార్చితో ముగిసిన 2023-24 అర్థిక సంవత్సరానికి మొత్తంగా రూ. 105 కోట్ల మేర నష్టాన్ని చవి చూసినట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. ఆహా కార్యకలాపాల వల్ల వస్తున్న ఆదాయం రూ. 133 కోట్లు. ఆపరేషన్స్ ఇన్కమ్ కాకుండా ఇతర ఆదాయాలు రూ. 4 కోట్లను ఆహా సంపాదించింది. మొత్తం ఆదాయం రూ. 137 కోట్ల వరకూ వచ్చింది. అయితే ఖర్చులు మాత్రం రూ. 277 కోట్లు తేలాయి. ఫలితంగా రూ. 105 కోట్ల వరకూ నష్టాన్ని చవి చూసింది.
అయితే ఆహా పని తీరు గతం కన్నా కాస్త మెరుగుపడిందని అనుకోవచ్చు. 2022-23 ఆర్థిక సంవత్సవరంలో వచ్చిన ఆదాయం కన్నా 2023-24లో వచ్చిన ఆదాయం తొమ్మిది శాతం మేర పెరిగింది. 2022-23లో రూ. 122 కోట్లుగా ఉన్న ఆదాయం 2023-24లోరూ. 137 కోట్లుగా నమోదు అయింది. అదే సమయంలో నష్టాలను కూడా తగ్గించుకున్నారు. 2022-23లో ఆహాకు వచ్చిన నష్టాలు రూ. 120 కోట్లు.. ఇప్పుడు రూ. 105 కోట్లకు నష్టం తగ్గింది. అంటే పదమూడు శాతం మేర నష్టం తగ్గినట్లుగా కంపెనీ ప్రకటించింది.
ఆహా సంస్థ తెలుగు మొట్టమొదటి ఓటీటీ. తర్వాత తమిళంలోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. స్థానిక భాషల సినిమాలతో పాటు ఇతర భాషల సినిమాల డబ్బింగ్ వెర్షన్లను రిలీజ్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ వంటి షోలనూ టెలికాస్ట్ చేస్తున్నారు. నిలకడగా ఆదాయం పెరుగుతున్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడం వల్ల నష్టాలు వస్తున్నాయి.