ఇటీవలే ‘ఆహా’ తో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు అల్లు అరవింద్ అండ్ టీమ్. అయితే… అమేజాన్, హాట్ స్టార్ లాంటి సంస్థలకు ధీటుగా కంటెంట్ ని మాత్రం సృష్టించలేకపోయారు. ఆహాలో కంటెంట్ అంత గొప్పగా లేదన్నది విమర్శకుల మాట. నిజానికి… కంటెంట్ కోసం ఆహా పెద్ద స్థాయిలోనే కసరత్తు చేసింది. మాజీ దర్శకుల్ని ఓ టీమ్ గా ఏర్పాటు చేసి, వెబ్ సిరీస్లను రూపొందించే ప్రయత్నాలు చేసింది. ఏమైందో ఏమో.. ఆహా నుంచి వచ్చిన వెబ్ సిరీస్లు ఇప్పటి వరకూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. కొత్త పోరడు లాంటి ఒకట్రెండు మెరుపులు తప్ప – ఆహాలో.. ఆహా అనిపించే కంటెంట్ లేదన్నది వాస్తవం.
అయితే సినిమాల్ని మాత్రం కొన్నింటికి కొనేసింది. ఇప్పుడు రాబోయే సినిమాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా చిన్న సినిమాలకు మంచి రేట్లు ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. లాక్ డౌన్ దృష్ట్యా చిన్న నిర్మాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దాంతో.. అలా పూర్తయి, విడుదల కాకుండా ఉన్న సినిమాల్ని వీలైనన్ని కొనాలని ఆహా టీమ్ నిర్ణయించుకుంది. ఈ విషయమై.. స్వయంగా నిర్మాతలతో అల్లు అరవింద్ బేరాలు చేస్తున్నట్టు సమాచారం. ఇండ్రస్ట్రీలో ఉంటున్న వ్యక్తి అరవింద్. ఏ సినిమాకి ఎంత అయ్యిందో అనే వివరాలు ఆయనకు బాగా తెలుసు. అంత నెట్ వర్క్ ఉంది కూడా. దాంతో.. సినిమాకి రీజనబుల్ రేటు ఫిక్స్ చేయగలరు.
అరవింద్ లాంటి వ్యక్తి రంగంలోకి దిగితే నిర్ణయాలు ఫటాఫట్ తేలిపోతుంటాయి. కొన్ని సినిమాలు ఇప్పటికే ఆహా చేతుల్లోకి వెళ్లిపోయినట్టు సమాచారం అందుతోంది. కొంతమంది నిర్మాతలు మాత్రం మే 7 వరకూ వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. ఆ తరవాత కూడా లాక్ డౌన్ కొనసాగితే మాత్రం చాలా సినిమాలు ఆహా ఫ్లాట్ ఫామ్ లో కనిపిస్తాయి. ఇలా కొత్త సినిమాల్ని నింపుకుంటే.. ఆహాకి మైలేజీ వస్తుంది. అందుకే అల్లు అరవింద్ ఈ విషయంలో బాగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.