ఓటీటీ ఫ్లాట్ఫామ్స్ మధ్య గట్టి పోటీ ఉందిప్పుడు. ఎవరు ఏ సినిమాని అమ్ముతారా? అంటూ పడిగాపులు కాస్తున్నారు. సినీ అభిమానులకు సైతం.. సినిమా చూడాలంటే ఓటీటీనే శరణ్యం అనుకుంటున్నారు. మిగిలిన సంస్థలన్నీ బడా సినిమాల్ని పట్టే పనిలో ఉంటే.. `ఆహా` మాత్రం ఈ విషయంలో చురుగ్గా స్పందించడం లేదు. ఆహాలో ఒకట్రెండు సినిమాలు వచ్చాయి. అవీ చిన్న సినిమాలే. ఈమధ్య ఆహాలో పెద్ద సినిమాలేం కనిపించడం లేదు. ఇటీవల ఆహా మూడు సినిమాల్ని స్ట్రీమింగ్కి దింపింది. ఆ మూడూ డబ్బింగులే. జ్యోతిక నటించిన 36తో పాటు, ట్రాన్స్, ఫోరెన్సిక్ సినిమాల్ని ఆహా తన ఓటీటీలో ఉంచింది. ఈ మూడూ విడుదలై చాలాకాలం అయ్యింది. వీటి ఒర్జినల్ వెర్షన్లు పలు చోట్ల అందుబాటులోకి వచ్చాయి. వాటిని ఇప్పుడు తక్కువ రేటుకి కొని, డబ్ చేసి తెలుగులో స్ట్రీమింగ్ చేస్తోంది. మలయాళ సినిమాల్ని తెలుగులో చూస్తున్నాం.. అన్న ఫీలింగ్ తప్పితే, కొత్త సినిమాల్ని చూస్తున్నాం అనే భావన ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు రాదు. ఇలాంటి డబ్బింగ్ సినిమాలు ఆహా దగ్గర కనీసం మరో అరడజను ఉన్నాయట. అయితే. పోటీలో నిలబడాలంటే.. డబ్బింగులతో నెట్టుకొస్తే సరిపోదు. పెద్ద సినిమాల్ని పట్టుకోగలగాలి. వాటిపై అల్లు అరవింద్ దృష్టి పెడితే మంచిది.