Aham Reboot movie review
అక్కినేని ఇంటి నుంచి వచ్చిన మరో హీరో సుమంత్. కావల్సినంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా – తన కెరీర్‌ని ఎందుకో మలచుకోలేకపోయాడు. లవ్ స్టోరీలు, మాస్ కథలు, యాక్షన్ సినిమాలూ చేసి ఇప్పుడు థ్రిల్లర్ కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు. తన నుంచి ఓ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. అదే ‘అహం రీబూట్’. ఎప్పుడో కరోనా టైమ్ లో చేసిన సినిమా ఇది. ఇన్నాళ్లకు మోక్షం దక్కింది. ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ఈ అహం… ఎలా ఉంది? సుమంత్ కష్టం ఫలించిందా?
నిలయ్ (సుమంత్) ఓ ఆర్జే. ఐదేళ్ల క్రితం తన వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోతుంది. ఆ గిల్టీతో చస్తూ బతుకుతూ ఉంటాడు. డ్రగ్స్ దందాలోనూ ఇరుక్కొంటాడు. జీవితంలో అన్నీ కోల్పోయాను అనుకొన్న దశలో ఓ రోజు… తన షోకు ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. తాను ఆపదలో ఉన్నానని, తనని కాపాడమని ప్రాధేయ పడుతుంది. నిజానికి ఈ కాల్ ని నిలయ్ ముందు సీరియస్‌గా తీసుకోడు. ఫ్రాంక్ అనుకొంటాడు. కానీ నిజంగానే ఆ అమ్మాయి ఆపదలో ఉందన్న విషయం అర్థమవుతుంది. పోలీసులు కూడా ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టే బాధ్యత నిలయ్కే అప్పగిస్తారు. మరి ఆ తరవాత ఏమైంది? ఆ అమ్మాయిని కాపాడగలిగాడా? ఆ ప్రయాణంలో ఏం తెలుసుకొన్నాడు అనేదే కథ.
సింగిల్ లొకేషన్, సింగిల్ ఆర్టిస్ట్… సినిమా ఇది. సుమంత్ తప్ప మరో నటుడు తెరపై కనిపించడు. రేడియో స్టేషన్ తప్ప ఇంకో లొకేషనూ ఉండదు. ఆలోచన బాగుంది. ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ కథని మలిచే స్కోప్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు, హీరో ‘అహం’ చూపించేందుకు సాహసించి ఉంటారు. డ్రగ్స్ దందాలో చిక్కుకొన్న నిలయ్, ఆత్మహత్య చేసుకొందామనుకొంటాడు. అక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది. ఆ తరవాత రేడియో స్టేషన్‌కి వెళ్లడం, అక్కడ కాల్ రిసీవ్ చేసుకోవడంతో కథలో ఆసక్తి మొదలవుతుంది. అమ్మాయి చెప్పిన క్లూలతో తాను ఎక్కడుందో కనిపెట్టడం ఓ టాస్క్. అసలు ఆ అమ్మాయి పేరు, ఐడెంటిటీ కనుక్కోవడం ఇంకో సవాల్. వాటిని ఛేదించే క్రమంలో వచ్చే మలుపులు కొంతమేర ఆసక్తి కలిగిస్తాయి. అయితే ఆ టెంపో చివరి వరకూ కొనసాగలేదు. ఎందుకంటే… సినిమా అనేది విజువల్ మీడియా. చాలా విషయాలు దృశ్య రూపంలోనే చెప్పాలి. ముఖ్యంగా సస్పెన్స్ చిత్రాల్లో కీలకమైన మలుపుల్ని సంభాషణల్లో చెప్పేస్తానంటే కుదరదు. ఆ ఎమోషన్ని అర్థం చేసుకొని, ఆస్వాదించాలంటే దృశ్య రూపం ఇవ్వాల్సిందే. ‘అహం’లో అది మిస్సయ్యింది. పాత్రధారులంతా ఫోన్లలో తమ వాయిస్‌లను వినిపిస్తుంటే ఓ దశలో బోర్ కొట్టేస్తోంది. చిన్నప్పుడు రేడియో నాటకం విన్న ఫీలింగ్ కలుగుతుంది.
రేడియో స్టేషన్‌కి ఓ అమ్మాయి ఫోన్ చేసి ఆపదలో ఉన్నానంటే – నేరుగా ఆమె పేరు, అడ్రస్స్ అడక్కుండా, క్లూస్ ద్వారా కనుక్కోవాలనుకోవడం ఏమిటో అర్థం కాదు. అమ్మాయి ప్రైవసీకి భంగం అనే లాజిక్ వేశారు కానీ, అది అర్థవంతంగా లేదు. ‘ఢీ’ సినిమాలో జెనీలియాని విలన్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆమె ఎక్కడ ఉందో తెలీదు. ఈ సమయంలో హీరో ఆమెను పట్టుకోవడం ఓ ఎపిసోడ్ గా తెరకెక్కించారు. ఆ ఎపిసోడే సినిమాగా తీశారంతే. కాకపోతే.. చివర్లో ఓ బలవంతపు ట్విస్టు ఇరికించారు. హీరో గతానికీ, ఈ కిడ్నాప్‌కి లింకు పెడతారన్న విషయం ముందు నుంచీ అర్థమవుతూనే ఉంటుంది. చివర్లో దర్శకుడు ఆ దారిలోనే వెళ్లాడు. మధ్యలో సుకుమార్ స్టైల్ లో లెక్కలూ, లాజిక్కులూ వేసి ప్రేక్షకుల బుర్ర పాడు చేయడంలో దర్శకుడు విజయం సాధించాడు. చాలా విషయాలు మాటల్లోనే చెప్పేయడం వల్ల వాటితాలుకూ ఇంపాక్ట్ ప్రేక్షకుడి వరకూ చేరలేకపోయింది. ఇదే కథని మామూలు సినిమాలానే తీసుంటే బాగుండేదేమో అనిపించింది.
సుమంత్ ఏకపాత్రాభినయం చేసిన సినిమా ఇది. హెయిర్ స్టైల్ కొత్తగా ఉంది. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు. మిగిలిన అందరూ తమ వాయిస్‌లతోనే నటించారు. ఒకే ఒక్క లొకేషన్ కాబట్టి నిర్మాణ విలువల గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఐడియా బాగానే ఉన్నా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే దర్శకుడు తడబడ్డాడు. గంటన్నరలో ముగిసే సినిమా ఇది. అదొక్కటే… ప్లస్ పాయింట్ అనుకోవాలి.