Ahimsa Movie Review
తెలుగు360 రేటింగ్: 1/5
కెరీర్ బిగినింగ్ లో క్లాసిక్ విజయాలు రావడం కూడా ఒక ఇబ్బందే. ప్రతిసారి ప్రేక్షకులకు ఆ అంచనాలు వుంటాయి. కానీ ప్రతిసారి క్లాసిక్ ఇవ్వడం అంత ఈజీ కాదు. ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ సినిమాని తన శత్రువుగా అభివర్ణిస్తాడు ఆ చిత్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్. కారణం.. తన నుంచి వచ్చే ప్రతి సినిమా ఆ స్థాయిలో వుండాలని ప్రేక్షకులు అంచనాలు పెట్టేసుకుంటారు. దర్శకుడు తేజకి కూడా ఇలాంటి ఇబ్బంది వుంది. తేజ తీసిన తొలి సినిమా ‘చిత్రం’ ఓ సంచలనం. తర్వాత జయం, నువ్వు నేను లాంటి ట్రెండ్ సెట్టర్ సినిమాలు వచ్చాయి. తర్వాత అలాంటి సినిమాలని మళ్ళీ అందుకోవడం తేజకి కష్టమైపోయింది. కొన్ని ప్రయత్నించారు కానీ మళ్ళీ అదే మూస సినిమాలని పెదవి విరిచారు ప్రేక్షకులు. ఐతే తన స్టయిల్ అంతా మార్చుకొని చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా మాత్రం తేజకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. వెంటనే ‘సీతతో’ మరో ఫ్లాపు ఎదురైయింది. ఇప్పుడు ‘అహింస’తో వచ్చారు తేజ. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు అభిరామ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం, కొత్తవారిని హీరోగా చేయడంలో తేజకి మంచి ట్రాక్ రికార్డ్ వుండటంతో అహింసపై ఆసక్తి ఏర్పడింది. మరి తేజ వింటేజ్ మార్క్ అహింసలో కనిపించిందా ? నటుడిగా అభిరామ్ ఎలా వున్నాడు? తొలి సినిమాతో విజయం అందుకున్న హీరోల వరుసలో చేరాడా ?
చీమకి కూడా అపకారం తలపెట్టని వాడు రఘు (అభిరామ్). వైలెన్స్ కి వందకిలో మీటర్ల దూరంలో ఉంటాడు. రఘు మరదలు అహల్య (గీతికా). ఒకరంటే ఒకరికి ఇష్టం. ఓరోజు రఘు పొలంలో పని చేస్తుంటే క్యారేజ్ కట్టుకొని వస్తుంది అహల్య. భోజనం తర్వాత ఇంటికి వెళుతున్న అహల్యపై అత్యాచారం జరుగుతుంది. ధనలక్ష్మి దుష్యంతరావు (రజత్ బేడి) ఇద్దరు కొడుకులు అహల్యని దారుణంగా అత్యాచారం చేస్తారు. అహల్యకు న్యాయం జరగాలని లాయర్ లక్ష్మి (సదా) సాహయంతో కోర్టుని ఆశ్రయిస్తాడు రఘు. మరి కోర్టులో న్యాయం జరిగిందా ?? అహింసావాదాన్ని నమ్మే రఘుకి దుష్యంతరావు నుంచి ఎలా సవాళ్ళు ఎదురయ్యాయి? ఈ పోరాటంలో చివరికి ఎవరు గెలిచారు ? ఎలా గెలిచారు ? అనేది తక్కిన కథ.
తేజలోని మంచి లక్షణం ఏమిటంటే ఆయన బయట సినిమాలని అనుకరించడు. అయితే ఆయనతో ఒక సమస్య కూడా వుంది. ఆయన స్టయిల్ ని ఆయనే కాపీ చేస్తుంటాడు. అహింస చూస్తున్నపుడు.. ఆయన చేసిన పాత సినిమాలన్నీ వరుసపెట్టి గుర్తుకు వస్తుంటాయి. పాత్రలని తీర్చిదిద్దిన విధానం, సన్నివేశాలని నడిపిన తీరులో ఎక్కడా కొత్తదనం లేకుండా జాగ్రత్తపడ్డాడు తేజ.
ఇది తేజ స్టయిల్ లో ఓ మాములు ప్రేమకథ. కానీ హింస- అహింస- కృష్ణతత్త్వం.. అంటూ ఏదో పెద్ద తత్వాన్ని భోదిస్తున్నట్లుగా ఓ వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. దుష్యంతరావు భార్య ఐదేళ్ళుగా తన భర్త జాడ తెలియడం లేదని పోలీసులు ఉత్తరం రాయడంతో కథ ఆరంభం అవుంతుంది. రఘుని వెత్తుకుంటూ అడవులకి వెళ్ళిన దుష్యంతరావు ఏమయ్యాడు ? అసలు రఘు ఎక్కడ ? అనే క్యురియాసిటీ ప్రేక్షకుల్లో కలగాలి. కానీ అలాంటిదేమి ఉండదు.
స్పెషల్ ఆఫీసర్ పాత్రలో రవి కాలే హడావిడిగా వచ్చి.. ఓ ఫైల్ ని పట్టుకుంటాడు. అది ఫైల్ అనడం కంటే కథలు పుస్తకం అనడం కరెక్ట్. బేసిగ్గా ఆయన మంచి నటుడే. కానీ దొరక్క దొరక్క అవకాశం దొరికిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా ఓవర్ యాక్షన్ చేస్తూ ఒకొక్క పేజీ తిప్పుతూ రఘు, అహల్య కథలోకి వెళ్తాడు. మొదటి సీన్ లోనే హీరోగా పాత్రని పరిచయం చేయడానికి తేజ ఎంచుకున్న సీన్ మరీ రొటీన్ గా వుంటుంది. తర్వాత బావ మరదళ్ల వచ్చే సన్నివేశాలు కూడా సోసో గానే వుంటాయి. హీరో పాత్రని అమాయకంగా చేసి హీరోయిన్ పాత్రని తెలివిగా గడుసుగా చేయడం తేజ స్టయిల్. ఆ స్టయిల్ అహింసలో కాపీ పేస్ట్ అయ్యింది. దీంతో ఆ ట్రాక్ పై పెద్ద ఆసక్తి కలగదు.
అహల్యపై అత్యాచారం జరిగిన తర్వాత సడన్ గా కథ కోర్ట్ రూమ్ కి మారిపోతుంది. పాపం అహింసా వాది, అమాయకుడైన రఘు ఆ కేసుని ఎలా నెట్టుకోస్తాడనే భావన ప్రేక్షకుల్లో కలిగినపుడు ఇలాంటి డ్రామా పడుతుంది. కానీ అలాంటి ఫీలింగ్ ఏమీ కలగదు. ఏకపక్షంగా విలన్ గ్యాంగ్ రొటీన్ కోర్టు సీన్స్ లో జరిగే అన్నీ చర్యలకు పాల్పడతారు. చివరికి దుష్యంతరావు నడిరోడ్డులో లాయర్ లక్షీని పొడిచి చంపేస్తాడు. ఇదేం అరాచకం రా బాబు అనుకోవడం తప్పితే ప్రేక్షకుడు చేసేది ఏమీ వుండదు.
ద్వితీయార్ధంలో ఈ కథ అడవి బాటపడుతుంది. అహల్యని హాస్పిటల్ నుంచి తప్పించే సీన్ లో తేజ మార్క్ కనిపిస్తుంది. అడవిలో వచ్చే ‘నీతోనీతోనే’ పాట కొంత ఊరట. అయితే ఎప్పుడైతే హీరో అహింస మార్గాన్ని వదిలి కృష్ణతత్త్వం వైపు నడిచాడో .. ఈ కథ మరో మలుపు తీసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. తనకి ఒక గన్ కావాలని హీరో లుండి గ్యాంగ్ ని ఆశ్రయించడం, వాళ్ళ వింత భాష, అక్కడ జరిగే పోరాటం… ఈ కథకు అదనపు భారాన్ని మోపాయి. నిజానికి తేజ కథలు ఇన్ని పొరలుగా వుండవు. తర్వాత ఏం చేయాలో అర్ధం కాక..ఈ లుండి గ్యాంగ్ ని ప్రవేశపెట్టారనిపిస్తుంది కానీ అది కథకు అవసరమని ఎంత మాత్రం అనిపించదు.
అహల్య కోరిక మేరకు రెండు హత్యలు చేసిన రఘు.. ఇక చట్టానికి దొరక్కుండా పారిపోవాలి. తన కొడుకుల చావుకి కారణమైన రఘుని దుష్యంతరావు చంపేయాలి. సెకండ్ హాఫ్ అంతా ఇక ఇదే గొడవ. చాలా పాత ట్రీట్మెంట్ ఇది. కథనంలో ఎక్కడా కూడా ఊహించని మలుపు వుండదు. చాలా నీరసంగా సాగిపోతుంటుంది. కొన్ని చోట్ల తేజ మార్కు కూడా మిస్ అయ్యింది. కొడుకుల శవాల్ని ఇంట్లో పెట్టుకొని వూర్లో జనాలని రఘుపై రెచ్చగొట్టడానికి.. ఒక ఐటెం సాంగ్ పెడతాడు దుష్యంతరావు. ఇది తెరపై చూస్తున్నపుడు అసలు ఇది తేజ సినిమానా? అనే అనుమానం కలుగుతుంది. అలాగే హాస్పిటల్ ఓ ఎత్తుపళ్ళతో వికారంగా ఓ అమ్మాయి పాత్రని ప్రవేశపెడతారు. ఆ అమ్మాయి ముసుగు తీసిన వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది. హీరోయిన్ ని తప్పించడానికి ఆ పాత్రని అనుకున్నారు కానీ అది తెరపైకి వచ్చిన విధానం మాత్రం తేజ స్టయిల్ కాదు. ఒక్కక్షణానికి తేజ ఏంటి ? జబర్దస్త్ రైటర్ లా అలోచించాడనిపిస్తుంది.
సినిమా అంతా చూసిన తర్వాత తేజ చెప్పదలచుకున్న కథలో స్పష్టత లోచించిందనేది స్పష్టంగా అర్ధమౌతుంది. సరైన ముగింపు లేని పాత్రలు కొన్ని మిగిలిపోయాయి. దుష్యంతరావు కనిపించకుండా పోవడం ఒక మిస్టరీ ఎలా అయ్యింది? దుష్యంతరావు అడవి తన బలగంతో వస్తాడు. కేవలం దుష్యంతరావునే చంపుతాడు రఘు. మరి ఆలాంటప్పుడు తన బలం ఏం చేస్తుంది? వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ? అసలు పోలీసులు రఘుకి ఎందుకు సాయం చేశారు ? ఇలా చాలా లోపాలు కనిపిస్తాయి.
అభిరామ్ కి తొలి సినిమా ఇది. బాబాయ్, అన్నయ్య హీరోలు. తను కూడా సినిమా నిర్మాణంలో వున్నాడు. విచిత్రం ఏమిటంటే.. సినిమాతో ఇంత దగ్గర ప్రయాణం ఉన్నప్పటికీ కెమరా అంటేనే భయపడినట్లు చాలా చోట్ల కనిపించాడు. రఘు పాత్రకు తన రూపం సరిపోయింది. నటనలో కూడా ఇన్వాల్ అయ్యింటే ఇంకా బావుండేది. నటనలో తన యీజ్ చాలా మెరుగవ్వాలి. గీతికా అందంగా వుంది. అభినయం ఓకే. రజత్ బేడి కటౌట్ బావుంది. ఈ సినిమాలో దుష్యంతరావు గా చేసిన రజత్ బేడి కంటే ఛటర్జీ గా చేసిన మనోజ్ టైగర్ ఎక్కువ స్క్రీన్ స్పెస్ తీసుకున్నాడు. పెద్ద లాయర్ గా వస్తాడు కానీ ఒక ఆకు రౌడీ, వీధి, గూండా.. ఇలా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటాడు. కోట్లు తీసుకుని వాదించే లాయర్ చూశాం కానీ ఈ పాత్ర మాత్రం చాలా వెరైటీ. పెద్ద తెలివైన లాయర్ తెరపైకి వచ్చి సాక్ష్యులందరికీ డబ్బు పంచుతాడు. తానకేదో వ్యక్తిగత నష్టం జరిపోయినట్లు.. పాపం ఆ హీరో, హీరోయిన్ ని హచ్ కుక్కలా వెంటపడతాడు. సదా పాత్రని మధ్యలో లేపేశారు. కమల్ కామరాజు, దేవిప్రసాద్, మిగతా కొత్తనటులు పరిధిమేర చేశారు.
టెక్నికల్ గా సినిమా బాగానే వుంది. నీతోనే పాట మెప్పిస్తుంది. నేపధ్య సంగీతం ఓకే. కెమరాపనితనం నీట్ గా వుంది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. లోకేషన్స్ బావున్నాయి కానీ అసలు ఈ కథ ఏ నేటివిటీలో జరుగుతోంది అంత రిజిస్టర్ కాకుండా చేశారు. పైగా ఆ లుండీ గ్యాంగ్ ఏమిటో, అది ఎక్కడుంటుదో.. నిజంగా అలాంటి గ్యాంగ్ వుంటే.. చిన్న వాయిస్ ఓవర్..లేదా వాళ్ళు మాట్లాడుతున్న భాషకి సబ్ టైటిల్స్ అయినా వేయాల్సింది.
నితిన్ ని జయంతో సక్సెస్ ఫుల్ హీరోగా పరిచయం చేశాడు తేజ. ఇప్పుడు అభిరాయ్ ని పరిచయం చేసే సినిమాకి కూడా అలాంటి నేపధ్యం వున్న కథనే ఎంచుకున్నాడు. కానీ ఇందులో హింస తప్పితే జయం లేదు.