తమిళనాడులో సీఎం స్టాలిన్ కక్ష సాధింపులకు పాల్పడటం లేదని బయట పబ్లిసిటీ వస్తోంది కానీ తమిళనాడులో మాత్రం సీన్ వేరేలా ఉంది. అక్కడ అన్నాడీఎంకే మంత్రులపై వరుసగా రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విరుచుకుపడుతున్నాయి. ఇళ్లలో సోదాలు చేసి కేసులు పెడుతున్నాయి. ఇప్పటికే నలుగురు మాజీ మంత్రుల్నిఇలా కేసుల్లో బుక్ చేసేశారు. తమిళనాడులో డైరక్టరేట్ ఆఫ్ విజినెల్స్ అండ్ యాంటీ కరప్షన్ పేరుతో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఉంది. ఈ దర్యాప్తు సంస్థ కొద్ది రోజులుగా అన్నాడీఎంకే నేతలపై దృష్టి పెట్టింది. వరుసగా సోదాలు నిర్వహిస్తోంది.
ముఖ్యంగా మాజీ మంత్రులపై దృష్టి పెట్టారు. మొదట మాజీ రవాణా మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. తర్వాత రిజస్ట్రేషన్ల శాఖ మాజీ మంత్రి వీరమణి, తర్వాత నగరాభివృద్ధి శాఖ నిర్వహించిన వేలుమణి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తాజాగా విద్యుత్‌శాఖ మాజీ మంత్రి తంగమణి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆదాయానికి మించి ఆస్తు లు గడించినట్టు కేసు నమోదు చేసింది. అన్నాడీఎంకే నేత తంగమణి కుటుంబసభ్యులకు ఆంధ్రాలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. ఏపీలోనూ వారి వ్యాపారాలపై తమిళనాడు డీవీఏసీ అధికారులుసోదాలు నిర్వహించారు.
అయితే ఈ సోదాలన్నీ కక్ష సాధింపులేనని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఎన్నికల వాగ్దానాల్ని విస్మరించిందని, వీటిని కప్పిపుచ్చుకునేందుకు తమ పార్టీ వర్గాల మీద దాడులకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. తాము అధికారంలో లేని పదేళ్ల కాలంలో ఎంతో మంది డీఎంకే నేతల్ని అరెస్ట్ చేశారని.. అది కక్ష సాధింపు అయితే.. ఇప్పుడు కూడా అలాగే అనుకోవాలని అన్నాడీఎంకే నేతలకు డీఎంకే నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే తాము సైలెంట్‌గా ఉంటే.. చేతకాని వాళ్లం అని అనుకుంటారేమో అని పబ్లిసిటీ రాకుండా స్టాలిన్ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.