తమిళనాడు రాజకీయాలపై భాజపా బాగానే పట్టు సాధించిందనడంలో సందేహం లేదు! మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత ఆ రాష్ట్రంపై రాజకీయ ఆధిపత్యం కోసం ఎన్ని రకాలు ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఒక దశలో పళని స్వామి, పన్నీరు సెల్వమ్ లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా కలిపారు. అప్పట్నుంచీ అన్నా డీఎంకే పూర్తిస్థాయిలో మోడీ చెప్పుచేతల్లోనే పనిచేస్తోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం, కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ఈ నేపథ్యంలో… అన్నాడీఎంకే తమ బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. మోడీ చాటు నేతలమే అని వారు ఈ సందర్భంగా మరింత బలంగా చాటి చెబుతున్నారు.
అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు అన్నాడీఎంకే ఎంపీలు సిద్ధమౌతున్నారు. అయితే, సమస్య ఇక్కడ ఆంధ్రా ప్రయోజనాలకు మద్దతు ఇవ్వకపోవడం ఒక్కటే కాదు… ఇదే క్రమంలో సొంత రాష్ట్ర ప్రయోజనాలను కూడా అన్నాడీఎంకే నేతలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నది ప్రధానాంశం. వాస్తవానికి, గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రానీయకుండా, సభను ఆర్డర్ లో లేకుండా చేసిందే తమిళ ఎంపీలు. స్పీకర్ పోడియం ముందు ప్రతీరోజూ నిరసనలు వారే తెలిపారు. కావేరీ బోర్డుపై వారు ఆందోళన చేశారు. అయితే, ఆ సమయంలో పన్నీర్ సెల్వానికీ, పళనిస్వామికీ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి కూడా చేశారు. కావేరీ అంశంలో టీడీపీ ఎంపీలు మీకు మద్దతు ఇస్తారనీ చెప్పినా కూడా వారు పట్టించుకోలేదు. చివరికి, గత సమావేశాల్లో అవిశ్వాసం చర్చకు వచ్చినా, తమిళనాడు సమస్యలపైనే మాట్లాడండి అని చెప్పినా కూడా వినిపంచుకోలేదు!
ఇప్పుడు కూడా మరోసారి మోడీకి మద్దతుగానే వ్యవహరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే… ప్రస్తుత అవిశ్వాసానికి మీరు మద్దతు ఇవ్వండీ, లేదంటే తమిళనాడు సమస్యలను మోడీ పట్టించుకోని పరిస్థితి వస్తుందని స్టాలిన్ కోరినా కూడా అన్నాడీఎంకే వినిపించుకోవడం లేదు. కేవలం మోడీకి మద్దతు ప్రకటించాలన్న క్రమంలో సొంత రాష్ట్ర సమస్యలను కూడా పణంగా పెడుతున్న పరిస్థితి. పోనీ.. భవిష్యత్తులో తమిళనాడు సమస్యల విషయమై పోరాటానికి సిద్ధమైనా, ఉత్తరాదికి చెందిన పార్టీలు పళని, పన్నీరులకు మద్దతుగా నిలిచి గొంతు కలిపే అవకాశం ఉంటుందా..? ఏదేమైనా, అన్నాడీఎంకే తాజా వైఖరితో స్పష్టమౌతున్న అంశం ఏంటంటే… ఆ పార్టీ నేతలు మోడీ చెప్పుచేతల్లోకి పూర్తిగా వెళ్లిపోయారనేది. ఈ పరిస్థితిని తమిళ ప్రజలు కూడా హర్షించే అవకాశం ఉండదు.