తమిళనాట మరో జల్లికట్టు మొదలైంది. ఈసారి ఎద్దులతో కాదు రాజకీయనాయకులతో. జయలలిత మరణం దగ్గర్నుంచి మొదలైన అనిశ్చితి పళనిసామి ఎంపికతో తెరపడిందనుకుంటున్న తరుణంలో ఆర్కే నగర్ రూపంలో మళ్ళీ రాజుకుంది. అవినీతి చుట్టూ ఇది తిరిగేస్తోంది. అవినీతిపై బ్రహ్మాస్త్రంగా డీమానిటైజేషన్‌ను మోడీ ప్రయోగించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చెలరేగిన అలజడి ఒకెత్తయితే… తమిళనాడులో అవినేతల తతంగం ఒకెత్తు. ఒక్క శేఖర్ రెడ్డి చాలు ఇందుకు ఉదాహరణ. నగదు కేంద్రాల నుంచి నేరుగా ఆయనింటికే వాహనాలు వెళ్ళాయని కూడా వార్తలొచ్చాయి. ఆ ఘటన తమిళనాడు సీఎస్ రామ్మోహనరావు ఉద్యోగానికే ముప్పుతెచ్చింది. కారణం ఇది కానప్పటికీ శశికళ కటకటాల పాలైంది. ఈ నేపథ్యంలో బీజేపీ చూపిన పరిపాలన చాతుర్యం బహుధా ప్రశంసనీయం. ఒక రాష్ట్రం అల్లకల్లోలం కాకుండా పరిణతి ప్రదర్శించి, పాలనను గాడిన పెట్టింది. పళనిసామి ముఖ్యమంత్రిగా ఎన్నికవడంతో కాస్త సద్దుకుంటున్న రాజకీయం మరోసారి తల లేపుతోంది. కారణం అన్నాడీఎంకెకు చెందిన ఎన్నికల చిహ్నం రెండాకుల గుర్తు. ఒక పార్టీలో విభేదాలు తలెత్తినప్పుడు పార్టీ పేరు..చిహ్నం మీద గొడవలు రేగడమూ సహజమే. తమళనాడులో శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలు రెండాకులు తమదంటే తమదంటే కొట్టుకోవడంతో ఎన్నికల కమిషన్ ఆ చిహ్నాన్ని ఫ్రీజ్ చేసేసింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్లో శశికళ వర్గం తరఫున పోటీచేస్తున్న ఆమె బంధువు దినకరన్ దుస్సాహసానికి పాల్పడ్డారని అనుమానాలు రేకెత్తుతున్నాయి. రెండాకుల గుర్తును తనకు కేటాయించేందుకు వీలుగా ఎన్నికల కమిషన్‌కే 50 కోట్ల వరకూ లంచాలివ్వడానికి ప్రయత్నించారని ఢిల్లీ పోలీసుల విచారణలో తేలింది. సుఖేశ్ చంద్రశేఖర్ అనే మధ్యవర్తికీ దినకరన్‌కూ మధ్య టెలిఫోన్ సంభాషణలను వారిందుకు సాక్ష్యంగా చూపుతున్నారు.
ఈ ఒక్క వ్యవహారం తమిళనాడును మళ్ళీ కాలుతున్న పెనంపైకి నెట్టింది. అదే సమయంలో పన్నీర్ సెల్వం కూడా విజ్ఞత ప్రదర్శించారు. ఒక కుటుంబం కింద పార్టీ పనిచేయడం తనకిష్టం లేదనీ, శశికళనూ, దినకరన్‌నూ బయటకు గెంటేస్తే తన వర్గాన్ని పార్టీలో కలిపేస్తాననీ ప్రతిపాదించారు. దినకర్ లేకుండానే ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఇది తమిళనాడు ప్రజలను మునివేళ్ళపై నిలబెట్టింది. ఒకపక్క అవకాశం కోసం ఎదురుచూస్తున్న డీఎంకే ఉండనే ఉంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఈసీ నుంచి కబురందిందంటున్నారు. పళనిసామి ముఖ్యమంత్రిగా కొనసాగేందుకూ పన్నీర్ సెల్వం క్యాబినెట్లో చేరేందుకూ అంగీకారం కుదిరిందనీ వార్తలొస్తున్నాయి. ఇది నిజమైతే.. తమిళనాడులో సంక్షోభం ముగిసినట్టే. ఇప్పటిదాకా శశికళకు జయజయధ్వానాలు చేసిన ఎమ్మెల్యేలూ, ఎంపీలూ కూడా పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్నారు. కలిసిపోవడానికే మొగ్గుచూపారు. అదీ రాజకీయం.. తమిళ రాజకీయం. తాజా జల్లికట్టులో శశికళ, దినకరన్‌లను ఎడ్లుగా మార్చి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వినోదం చూస్తున్నారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి