అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలోని అంశాలు చూసి.. అందరూ నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. అందులో అందరినీ ఆకర్షిస్తున్న పథకం.. రేషన్‌కార్డుదారులందరికీ ఉచితంగా అమ్మ వాషిం గ్ మెషిన్లు. గతంలో జయలలిత మిక్సీలు, గ్రైండర్లు ఇచ్చారు. ఈ సిరీస్‌ను.. ఆమె వారసులు కొనసాగిస్తున్నారన్నామాట. అయితే తమిళనాడులో రెండు కోట్ల వరకూ రేషన్ కార్డులు ఉంటాయి. అంత మందికి వాషింగ్ మెషిన్లు ఇవ్వగలరా అన్నది ఆలోచించే పరిస్థితి తమిళరాజకీయ పార్టీలకు లేదు. అది ఒక్కటే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి. సోలార్ స్టౌలతోపాటు ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇళ్లు లేని వారికి అమ్మ ఇళ్లు, నవదంపతులకు సారే వీటిలో కొన్ని.
అంతే కాదు… ఏపీలో జగన్మోహన్ రెడ్డి చేపట్టిన రేషన్ డోర్ డెలివరి పద్దతిని తాము కూడా పాటిస్తామని పళనీస్వామి, పన్నీర్ సెల్వం సంయుక్తంగా మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. గృహిణుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా రూ.1,500 జమ. బస్సుల్లో మహిళలకు 50 శాతమే చార్జీ వసూలు. విద్యా రుణాల మాఫీ. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా సదుపాయం. వృద్ధాప్య పింఛను రూ.1000 నుంచి రూ.2000కు పెంపు. ఆటో కార్మికులకు రూ.25 వేల సబ్సిడీతో ఎంజీఆర్ గ్రీన్ ఆటోలు. జర్నలిస్టులకు ఉచిత గృహాలు, పింఛన్. ఇలా.. లెక్క లేనన్ని హామీలు ఉన్నాయి. వీటితో ఓ పెద్ద పుస్తకమే అవుతుంది.
డీఎంకే మేనిఫెస్టో కూడా ఏమీ తగ్గలేదు. అదే రేంజ్లో హామీలు గుప్పించారు. దేశంలో ఉచిత పథకాల హామీలకు తమిళనాడురాష్ట్రమే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. ఉత్తరాదిలో కూడా ఇలాంటి హామీలు ప్రారంభం కావడానికి తమిళనాడే ఆదర్శం. ఇక దక్షిణాదిలో చెప్పాల్సిన పని లేదు. తమిళనాడుతో పాటు ఏపీలోనూ.. ఈ హామీలు.. గేమ్ చేంజర్లుగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ నగదు బదిలీ పథకాలు ఇప్పుడు… దేశం మొత్తం హాట్ టాపిక్ అవుతున్నాయి.