తమిళనాట కొత్త పార్టీతో రాజకీయ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విజయ్ తన ప్రసంగాల్లో ఎక్కడా అన్నాడీఎంకను పల్లెత్తు మాట అనడం లేదు. పూర్తిగా డీఎంకేను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారు కానీ పొత్తుల గురించి కూడా ఆలోచిస్తానని చెబుతున్నారు. తమనేమీ విమర్శించకపోవడం.. పొత్తుల గురించి ఆశాజనకంగా మాట్లాడుతూండటంతో అన్నాడీఎంకే నేతల్లోఆశలు పుడుతున్నాయి.
అన్నాడీఎంకేకు ప్రస్తుతం నాయకత్వం లేక నిర్వీర్యమైపోతోంది. పన్నీర్ సెల్వం, పళనీ స్వామి మధ్య నలిగిపోయినపార్టీ చివరికి పన్నీర్ సెల్వంను బయటకు పంపడంతో పళనీ స్వామి చేతల్లోనే పార్టీ ఉండిపోయింది. కానీ ఎదుగూ బొదుగూ లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు.ఇప్పుడు విజయ్ పార్టీతో పోరాటం విజయ్ వర్సెస్ ఉదయనిధి అన్నట్లుగా మారుతుందని అంచనాలు రావడంతో అన్నాడీఎంకే ఎందుకైనా మంచిదని పొత్తులు సెట్ చేసుకుంటే బెటరని అనుకుంటోంది.
సరైన నాయకుడు లేకపోయినా అన్నాడీఎంకేకు మంచి క్యాడర్ ఉంది. గ్రామస్థాయి నుంచి భావజాలం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. ఆ బలం విజయ్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సినిమా తారలకు క్రేజ్ ఉంటుంది కానీ.. ఓట్లు వేస్తారా అన్న సందేహం తమిళనాడులోనూ ఉంది. విజయ్ కాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా విఫలమయ్యారు. అందుకే విజయ్ పార్టీ సభలకు వచ్చే జనాలను ఎవరూ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది కూడా అన్నాడీఎంకేకు ప్లస్ పాయింట్ లా కనిపిస్తోంది.