తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకటే హడావుడి..! రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ ఫుల్ ఫోకస్ పెట్టడంతో… ఢిల్లీ నుంచి నాయకుల రాకపోకలు పెరిగాయి. నాయకుల మధ్య సమన్వయ లోపం, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా పలువురు నేతలతో వ్యక్తిగతంగా సమావేశమౌతున్నారు. రాహుల్ గాంధీ దగ్గరకి వెళ్దామని బయలుదేరుతున్న నేతలతో కూడా ముందుగా ఈయనే మాట్లాడుతున్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నేతల మధ్య భేదాభిప్రాయాలను కూడా పరిష్కరించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులను పార్టీ రంగంలోకి దించింది.
జిల్లాలవారీగా పార్టీని అధ్యయనం చేయడం, సమస్యలను పరిష్కరించేందుకు ఏఐసీసీ కార్యదర్శులు పర్యటించనున్నారు. ముగ్గురు సెక్రటరీలను రంగంలోకి దింపుతున్నారు. ఈ ముగ్గురూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను కవర్ చేస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8వ తేదీన సెక్రటరీ రాజు పర్యటిస్తారు. ఈనెల తొమ్మిది, పది తేదీల్లో మహబూబ్ నగర్ జిల్లాలో సలీం అహ్మద్ పర్యటిస్తారు. మరో సెక్రటరీ శ్రీనివాసన్ కృష్ణన్ 10, 11 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటన ఉంటుంది. స్థానిక నాయకులతో చర్చించడంతోపాటు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులు, బ్లాక్, మండలాధ్యక్షులతో ఈ కార్యదర్శలు సమావేశమౌతారు. ఈ పర్యటనల ద్వారా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమౌతున్న నాయకుల బలాలను తెలుసుకోవడంతోపాటు, స్థానికంగా నేతల మధ్య ఉన్న సమస్యలపై కూడా అధ్యయనం చేస్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తామన్న వారిని చేర్చుకోవడం కూడా ఒక ప్రముఖ అజెండాగానే పెట్టుకున్నట్టు సమాచారం.
ఇక, రాష్ట్ర స్థాయి నేతలతో వ్యక్తిగతంగా ముఖాముఖీ కార్యక్రమాలు కుంతియా నిర్వహిస్తారు! ప్రముఖుల మధ్య ఉన్న అభిప్రాయాభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ ప్రక్రియను ఆయన ఇప్పటికే ప్రారంభించారు. తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్ఠానం ఒక్కసారిగా దృష్టి కేంద్రీకరించడం మంచిదే. కాకపోతే, ఈ సమస్యలన్నీ వారు అనుకున్నంత వేగంగా పరిష్కారమౌతాయా అనేదే సమస్య..! ఎందుకంటే, ఓ నాలుగు రోజులపాటు ఢిల్లీ నుంచి ఏఐసీసీ కార్యదర్శులు వచ్చి, జిల్లాల్లో పర్యటించేసి, నేతల మధ్య సయోధ్య కుదిర్చేశామనీ, ఇకపై అందరూ కలిసి పనిచేయడం గ్యారంటీ అనే భరోసాతో తిరిగి వెళ్లిపోతే సరిపోతుందా..? మరి, ఏఐసీసీ వ్యూహమేంటో తెలీదుగానీ… రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్క దెబ్బతో పరిష్కరించేద్దాం అనుకుంటున్నారు.