మజ్లిస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడానికి అసదుద్దీన్ కొంత కాలంగా శ్రమిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా బీజేపీని గెలిపించడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతీ రాష్ట్రంలోనూ పోటీ చేస్తూ వస్తున్నారు. ముస్లిం జనాభా మెజార్టీ ఉన్న ప్రాంతాల్లో కొన్ని సీట్లను సాధిస్తోంది. అయితే అన్ని చోట్లా చొచ్చుకుపోలేకపోయింది. మహారాష్ట్రలోనూ కాస్త ప్రభావం చూపింది. బీహార్‌లో ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేల్ని గెలిపించుకోగలిగారు.
ఇప్పుడు ఇతర చోట్ల మజ్లిస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీ వదిలేస్తున్నారు. రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఐదుగురు ఎమ్మెల్యేల్లో నలుగురు.. మజ్లిస్‌ను ఆర్జేడీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. బిహార్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 20 స్థానాల్లో ఆర్జేడీ విజయావకాశాలను మజ్లిస్ పార్టీ దెబ్బకొట్టింది. అదే మజ్లిస్ పీక్ స్టేజ్. రాను రాను తగ్గిపోతోంది. యూపీలో జాతీయ మీడియా ఎంత హైప్ ఇచ్చినా కనీసం డిపాజిట్లు రాలేదు.
ఇక ఏ ఇతర రాష్ట్రంలోనూ మజ్లిస్ ఉనికి కనిపించలేదు. దీంతో ముస్లింలు కూడా ఆ పార్టీని ఓన్ చేసుకోవడంలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. యూపీ కంటే ముందు బెంగాల్లోనూ మజ్లిస్ పోటీ చేసింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ పార్టీ నేతలందరూ వరుసగా తృణమూల్‌లో చేరిపోయారు. ఇప్పుడు ఆర్జేడీలో చేరుతున్నారు. మొత్తంగా దేశం మొత్తం మజ్లిస్‌ను విస్తరించాలనుకున్న ఓవైసీ పాతబస్తీలో తన పార్టీని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.