బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన ఎఐఎంఐఎం (మజ్లీస్) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ షరా మామూలుగానే ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడంతో పూర్ణియా జిల్లాలో బైసాయి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసేందుకు వారెంట్ జారీ చేసారు. ఆయన సంగతి ఏమయిందో గానీ బీహార్ వెళ్లి అన్నగారు బుక్ అయిపోయారు. ఎంఐఎం పార్టీ మొట్ట మొదటిసారిగా ఈ ఎన్నికల ద్వారా బీహార్ లో అడుగుపెడుతోంది. సీమాంచల్ ప్రాంతంలో కిషన్ గంజ్, రాణి గంజ్, బైసి, అమౌర్, బలరాంపూర్ ఆరు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తోంది. అసదుద్దీన్ అరెస్టును నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఎంఐఎం కార్యకర్తలు ధర్నా చేసారు. ఎన్నికల సమయంలో ముస్లిం ప్రజలను ఆకట్టుకొనేందుకే ఓవైసీ సోదరులు సాధారణంగా ఇటువంటి పనులు చేస్తుంటారు. అయితే అసదుద్దీన్ ఓవైసీని పోలీసులు అరెస్ట్ చేసిననత మాత్రాన్న అక్కడి ముస్లిం ప్రజలు ఆయనపై సానుభూతితో మజ్లీస్ అభ్యర్ధులకు ఓట్లేస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే బీహార్ ప్రజలకు ఇంతవరకు ఓవైసీ సోదరులను, మజ్లీస్ పార్టీని ఎన్నడూ చూడలేదు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆర్.జె.డి., జే.డి.యూ., తదితర పార్టీలు కూడా ఆ నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్ధులనే నిలబెట్టాయి. కనుక ప్రజలు వాటికే మొగ్గు చూపవచ్చును. ఒకవేళ ఈ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ రెండు మూడు సీట్లు గెలుచుకొన్నా అది దానికి గొప్ప విషయమే అవుతుంది. లేకుంటే మళ్ళీ హైదరాబాద్ పాతబస్తీకే పరిమితం కార్యక్రమానికి తప్పదు.