తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీట్ల సర్దుబాటు వ్యవహారం ఢిల్లీలో వాడీవేడీ చర్చ కొనసాగుతోంది. అయితే, మహా కూటమిలో భాగంగా మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన సీట్లతోపాటు, కాంగ్రెస్ పోటీ చేయబోతున్న 93 స్థానాలపై కూడా దాదాపు పూర్తి స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 74 మంది పేర్లు కూడా ఖరారు అయినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రానికి ఈ లిస్టుపై మరింత స్పష్టమైన సమాచారాన్ని పార్టీ వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా… అసంతృప్త నేతల్ని నేరుగా ఢిల్లీకే ఏఐసీసీ రప్పించుకుని, చర్చిస్తూ ఉండటం విశేషం. మహా అయితే ఒక మంత్రి స్థాయి నాయకుడు, లేదా రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జుల వరకూ మాత్రమే టిక్కెట్లు దక్కని ప్రముఖుల విషయంలో డీల్ చేసేవారు. అయితే, ఇప్పుడు ఒక నియోజక వర్గంలో కాస్త పట్టున్న మండల స్థాయి నేతల్ని కూడా ఢిల్లీకి పిలుస్తున్నారు!
రెబెల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని చెప్పుకోవచ్చు. టిక్కెట్లు దక్కని నేతల్ని హైదరాబాద్ లోనే ఉంచితే, ఇక్కడి మీడియా ఫోకస్ అంతా వారిపైనే ఉండటం, ఇంకోపక్క తెరాస కూడా ఇలాంటి అసంతృప్తులను ఆకర్షించే వ్యూహాలను వెంటనే అమలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఈ మొత్తం వ్యవహారాన్ని ఢిల్లీకి తరలించేశారని చెప్పొచ్చు. సమీప భవిష్యత్తులో పార్టీ నుంచి సరైన గుర్తింపు లభిస్తుందనే భరోసాను నేరుగా ఏఐసీసీ నుంచే నేతలకు ఇప్పించడంతోపాటు, ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు అందరూ కృషి చేయాలనే దిశానిర్దేశం కూడా జాతీయ స్థాయి నేతల ద్వారానే చేయిస్తేనే పరిస్థితి అదుపులో ఉంటుందనేది కూడా పీసీసీ వ్యూహంగా కనిపిస్తోంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే… మహా కూటమిలోని అసంతృప్త భాగస్వామ్య పక్షాల నేతల్ని కూడా నేరుగా ఢిల్లీకే మరోసారి పిలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు కోదండరామ్ ని మళ్లీకి హస్తినకు పిలుస్తారని కథనాలు వినిపిస్తున్నాయి. సీపీఐ విషయానికొస్తే… ఆ పార్టీకి మూడు సీట్లు దాదాపు ఖరారు అయినా, ఖమ్మం జిల్లాలో మరో స్థానం కావాలంటూ వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై ఏకంగా సీపీఐ జాతీయ స్థాయి నేతలతో ఏఐసీసీ డీల్ చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతోపాటు, చాడా వెంకట రెడ్డిని కూడా ఢిల్లీకి ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓవరాల్ గా.. సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇదే క్లైమాక్స్ సీన్ అని చెప్పుకోవచ్చు.