మంత్రులం కదా… మనం ఏం మాట్లాడినా ఫర్వాలేదూ, అధికారులు పడుంటారు అనే అభిప్రాయం తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ప్రతీసారీ ఏలికలకు ఉంటుందన్న విమర్శ ఎప్పట్నుంచో ఉంది. ఆ ముద్రను చెరుపుకునేందుకు చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే, ఎవరేమన్నా పడి ఉండటానికి అందరు అధికారులూ ఒకేలా ఉండరు! నాయకుల తీరును ఉల్టా విమర్శించేవారూ ఉంటారు. టీడీపీ ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఇప్పుడు అలాంటి అనుభవమే ఎదురైందని సమాచారం!
ఎయిర్ ఇండియా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయ్యాయి! ఉద్యోగుల్లో అంకిత భావం లోపించిందని రాజావారు కామెంట్ చేశారట. పనిపట్ల అంకింత భావంతో ఉన్నవారు తక్కువయ్యారనీ, లేదంటే ఎయిర్ ఇండియా మంచి లాభాల్లో ఉండేదన్న మీనింగ్‌లో వ్యాఖ్యానించారు. అక్కడితో ఆగితే బాగుండేది. ప్రైవేటు విమానయాన సంస్థల ఉద్యోగుల పనితీరుతో వాళ్లని పోల్చారు! పక్కవారితో పోల్చితే ఎవరికైనా కోపం వస్తుంది కదండీ. శుభాషిస్ మంజుందార్ అనే పైలెట్‌కి మంత్రిగారి వ్యాఖ్యలు మంటపుట్టించాయి. వెంటనే ఆయనకు క్లాస్ తీసుకుంటూ లేఖ రాశాడు.
తానో ఎయిర్ ఇండియా ఉద్యోగిననీ, ఎంతో అంకిత భావంతో దేశభక్తితో విధులు నిర్వహిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ‘నా సంగతి సరే… దేశంపై బాధ్యత ఉండాల్సిన మీరేం చేస్తున్నారు? గడచిన పార్లమెంటు సమావేశాల్లో విలువైన 92 గంటల సమయాన్ని వృథా చేశారు. ప్రదర్శనలతోనే కాలం గడిపేశారు. ప్రజల సమస్యలపై చర్చించలేకపోయారు. సభ సజావుగా సాగకుండా అడ్డుపడటమే కదా మీరు చేసింది. ఇతర దేశాల చట్ట సభలతో పోల్చి చూస్తే మీరు ఎక్కడున్నారో చూసుకోండి’ అంటూ లేఖలో వాయించేశాడు.
తమను ఇతర సంస్థల ఉద్యోగులతో పోల్చేసరికి… ఇతర దేశాల నాయకులతో మంత్రులను ఆ పైలెట్ పోల్చాడు. ఉద్యోగులను ఉత్సాపరచాలన్న ఉద్దేశంతో అశోక్ గజపతి క్లాస్ తీసుకుంటే.. అది కాస్తా ఇలా రివర్స్ అయింది. ఇప్పుడీ పైలెట్ లేఖకు నెటిజన్ల మద్దతు కూడా లభిస్తోంది. ఆ పైలెట్ చెప్పింది నిజమే కదా అంటూ చాలామంది సమర్థిస్తున్నారు. అయినా… మన సంస్థను మనమే కాపాడుకుందాం, కష్టపడి పనిచేద్దాం అంటూ ఉద్యోగులకు సాఫ్ట్‌గా చెప్పాలిగానీ, ఇలా పెత్తనం చెలాయించాలనుకుంటే భరించే రోజులా ఇవి..?