దేశంలో గల ప్రసిద్ద పుణ్యక్షేత్రాలలో మహారాష్ట్రలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం కూడా ఒకటి. రైలు, రోడ్డు మార్గాల ద్వారా అక్కడకు చేరుకోవడానికి సదుపాయం ఉన్నప్పటికీ విమానాశ్రయం లేకపోవడంతో దూర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులు బస్సులు, రైళ్ళలోనే అక్కడికి చేరుకోవలసి వస్తోంది. షిరిడిలో విమానాశ్రయం నెలకొల్పాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. ఎట్టకేలకు అది కూడా సాకారమయింది. షిరిడికి అతి సమీపంలో ఒక విమానాశ్రయ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. మహారాష్ట్ర ఎయిర్ పోర్ట్ డెవెలప్ మెంట్ కంపెనీ దీనిని నిర్మించింది. ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి అక్కడకి విమాన సేవలు అందుబాటులో వస్తాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తి స్థాయిలో అన్ని రకాల విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి. షిరిడికి ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి నిత్యం చాలా మంది భక్తులు వెళుతుంటారు. కనుక ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో ప్రధాన నగరాల నుంచి షిరిడికి విమాన సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.