ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. బారత్‌లో సింగిల్ ఇంజిన్ హెలికాఫ్టర్ తయారీ ప్లాంట్ పెట్టాలని ఎయిర్ బస్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.ఇప్పటికే నాలుగు రాష్ట్రాలను షార్ట్ లిస్ట్ చేసుకంది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఏపీని కూడా పరిశీలించింది. ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా రాయితీలు, సౌకర్యాలు కల్పించేందుకు సిద్దమని సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాయలసీమలో తయారీ రంగానికి అనువైన వాతావరణం ఉందని ఏపీ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. కియా పరిశ్రమ ఎంత వేగంగా పూర్తయిందో.. ఉత్పత్తి ప్రారంభమయిందో ఓ కేస్ స్టడీగా చూపిస్తున్నారు. విద్యుత్, నీరు , భూమి వంటి మౌలిక సదుపాయాలతో పాటు ట్రాన్స్ పోర్టుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏపీకి ఉన్నాయని చెబుతున్నారు. ఈ ప్లాంట్ కోసం పోటీ పడుతున్న మిగతా మూడు రాష్ట్రాలు పారిశ్రామిక పరంగా అభివృద్ది చెందినవే.
గుజరాత్, మహారాష్ట్ర,కర్ణాటక పారిశ్రామికంగా ఎంతో ముందున్నాయి. ఏపీ కొత్త రాష్ట్రం కావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సాహకాలు భారీగా ఇస్తోంది. ఈ క్రమంలో అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఎయిర్ బస్ సంస్థ కూడా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ లిస్టు చేసుకున్న నాలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ప్లాంట్ పెడతామనేది త్వరలోనే ఎయిర్ బస్ సంస్థ ప్రకటించనుంది.