వరంగల్ అభివృద్ధికి ఎంతో దోహదపడే ఎయిర్ పోర్టు విషయంలో మరో అడుగు ముందుకు పడింది. విమానాశ్రయం కోసం ఎయిర్ పోర్ట్స్ అధారిటీ వద్ద ఉన్న భూమి కాకుండా మరో 150 ఎకరాల వరకూ భూమి అవసరం. ఆ భూమిని సేకరించి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
వరంగల్ లో ఎయిర్ పోర్టు కొత్తది కాదు. మామునూరులో 1930లో నిజాం హయాంలో ఎయిర్ పోర్ట్ ఉంది. కానీ 1980లో మూతపడింది. మారుతున్న కాలంతో దీన్ని అందుబాటులోకి తెచ్చే అంశంపై సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సర్వేలు కూడా చేసింది. వరంగల్ ఎయిర్ పోర్టుకు మరో అడ్డంకి కూడా ఉంది. హైదరాబాద్ లో జీఎంఆర్ ఎయిర్ పోర్టు నిర్మించినప్పుడు మరో ముఫ్పై ఏళ్ల వరకూ 150 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం నిర్మించబోమని ఒప్పందం చేసుకున్నారు.
2017లో కేంద్రం తీసుకొచ్చిన ఉడాన్ పథకం కింద మామునూరు ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలను చాలా కాలం నుంచి ఉంచారు. ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కానీ దీనికి ముందడుగు పడలేదు. MR సంస్థతో పలు మార్లు చర్చలు జరపగా.. ఎట్టకేలకు 150 కిమీ నిబంధలను పక్కకు పెట్టి మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఒప్పుకుంది.
మామునూరులో ఎయిర్ పోర్టు నిర్మాణం ప్రారంభమైతే చాలు వరంగల్ నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని.. భూముల విలువలు కూడా అమాంతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.