ముఖేష్ అంబానీ జియోలో వాటాలు అమ్మేసి… ప్రపంచ కుబేరుడిలో ఒకరిగా ఎదిగిపోగా… ఆయనకు పోటీగా ఆదాని కూడా.. ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అంబానీ లేని బిజినెస్‌లలో ఆయన గట్టి ముద్ర వేస్తున్నారు. అదానీది ప్రధానంగా పోర్టులు.. ఎయిర్‌పోర్టుల వ్యాపారం. పోర్టుల విషయంలో ఇప్పటికే పట్టు సాధించారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద ప్రైవేటు పోర్టు కృష్ణపట్నం కూడా అదానీ చేతుల్లోకి వెళ్లిపోయింది. మరికొన్ని పోర్టులపైనా ఆయన గురి పెట్టారు. తాజాగా కేంద్రం ఎయిర్‌పోర్టులనూ ఆదానికి అప్పగించేస్తూ నిర్ణయం తీసుకుంది. జైపూర్, గౌహతి, తిరువనంతపురం విమానాశ్రయాలను పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్ భాగస్వామ్యం ద్వారా లీజ్ ఇచ్చే విధానంలో అదానీకి అప్పగించారు.
గ్లోబల్ కాంపెటేటివ్ బిడ్డింగ్‌లో అదానీకి అవి లభించాయని.. 50 ఏళ్లకు లీజ్ కు అప్పగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం రైళ్లను కూడా ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికి శాంపిల్‌గా ప్రైవేటు రైలు పరుగులు పెడుతోంది. . దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 ప్రైవేటు రైళ్లను ప్రైవేటుగా తిప్పాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. వీటి కోసం.. పోటీ పడుతున్న సంస్థల్లో అదానీ సంస్థ కూడా ఉంది. ఎయిర్‌పోర్టులో దక్కించుకున్నందున రైళ్లు దక్కించుకోవడం పెద్ద విషయం కాకపోవచ్చునని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రభుత్వాల చేతుల్లో ఉండాల్సిందేనన్న గట్టి అభిప్రాయాలు వినిపించే పోర్టులు… ఎయిర్‌పోర్టులు.. రైళ్లు వంటి వాటిలో ప్రైవేటు పెట్టుబడుల్ని విపరీతంగా ఆహ్వానించడం.. అదీ కూడా.. ఆదానీ లాంటి బీజేపీతో సన్నిహితంగా ఉండే పారిశ్రామిక వేత్తలకు అగ్రతాంబూలం దక్కుతూండటం… సహజంగా రాజకీయంగా అనుమానాలకు తావిచ్చే అంశమే. కొసమెరుపేమిటంటే.. కొద్ది రోజుల కిందట.. జీవీ కృష్ణారెడ్డికి చెందిన ఆస్తులపై సీబీఐ, ఈడీ దాడులు చేసింది. దానికి కారణం ముంబై ఎయిర్‌పోర్టు లో అవకతవకలు. అయితే.. అందులో వాటా ఇవ్వడానికి నిరాకరించడం వల్లనే ఈ దాడులు జరిగాయని.. బిజినెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే.. ఆదానీ కూడా.. త్వరలో అంబానీ స్థాయిలో ధనవంతుడయ్యే అవకాశం ఉంది.