కౌన్ బనేగా కరోడ్‌పతి… లాక్ కియా జాయ్.. కంప్యూటర్జీ అంటూ అలరించిన.. టీవీ సెట్లకు ప్రేక్షకులను కట్టిపడేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌బచ్చన్ షో ఎంత పాప్యులర్ అయ్యిందో తెలిసిందే కదా. 2001లో ప్రారంభమైన ఆ షో ఇప్పటి వరకూ 8 సీజన్లు పూర్తిచేసుకుంది. తొమ్మిదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈసారి ఓ మార్పు. ఎవ్వరూ ఊహించని మార్పు. ఈ షోను ఒక మహిళ నిర్వహించబోతోంది. దీనికోసం నిర్వహకులు అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్య రాయ్‌ని సంప్రదించారు. అందరికీ ఆమోదయోగ్యమైతే ఐశ్వర్య చిన్నితెరపై కేబీసీలో తళుకులీనడానికి సిద్ధమవుతారు. నిర్వాహకులు పనిలోపనిగా మాధురీ దీక్షిత్‌ను కూడా సంప్రతించారట. అంటే ఇద్దరిలో ఎవరు అంగీకారం తెలిపిన కేబీసీని ఓ మహిళ నిర్వహించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐశ్వర్య ఖాయమైతే… ఇంతవరకూ ర్యాంప్‌ల మీద.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ మెరిపించిన మెరుపులు చిన్నితెరను తాకుతాయన్న మాట.
అమితాబ్ షో నిర్వహించిన తీరు నిరుపమానం. ఏబీసీలో వచ్చిన నష్టాలతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన్ను ఈ షోనే ఇబ్బందుల్ని గట్టెక్కించిందని చెబుతారు. 2001లో కోటి రూపాయలున్న ప్రైజ్ మనీ 2002లో రెండు కోట్ల రూపాయలైంది. ఈ విషయాలను పక్కనబెడితే.. తెలుగు చిన్ని తెరపై నాగార్జున నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో కూడా అమితంగా ఆకట్టుకుంది. అమితాబ్ స్థాయిలో ఆయన ఆ షోను నిర్వహించారు. అక్కినేని నాగార్జున. తాజాగా ఇప్పుడా బాధ్యతను మెగాస్టార్ చిరంజీవి చేపట్టారు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి