భారత రిపబ్లిక్ డే పరేడ్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్ ఏర్పాటు చేసిన లంచ్ పార్టీలో ఓ తార తళుక్కుమంది. ఆమె ఐశ్వర్యా రాయ్. రాజ్ పథ్ లో పరేడ్ ముగిసిన తర్వాత హోలెండ్ ప్రత్యేక లంచ్ కు వెళ్లారు. భారత్ లో ఫ్రాన్స్ రాయబారి ఈ విందు ఏర్పాట్లు చేశారు. ఎంతో మంది సెలెబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రముఖులు ఈ లంచ్ కు హాజరయ్యారు.
హోలెండ్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపిన ఐశ్వర్యా రాయ్ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హోలెండ్ మన దేశానికి ముఖ్య అతిథి అయితే, ఆయన విందుకు ఐష్ చీఫ్ గెస్ట్ అయింది. ఎర్రటి బనారసీ పట్టు చీరలో తళుక్కుమన్న ఈ తారను చూసి హోలెండ్ ఆప్యాయంగా పలకరించారు. ఎంతో ఉల్లాసంగా ఆమెతో మాటామంతీ జరిపారు. సినిమాల గురించి, కేన్స్ ఉత్సవాల గురించీ మాట్లాడుకున్నారు. ఐశ్వర్య గలగలా నవ్వుతూ మాట్లాడుతుంటే హోలెండ్ అలా చూస్తూ ఉండిపోయారు. ఈ విందులో ఐష్ చాలా ప్రత్యేకంగా కనిపించిందని, చాలా గ్లామరస్ గా ఉందని సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వెల్లువెత్తాయి. చాలా కాలం తర్వాత ఐష్ ఇంత పెద్ద లంచ్ పార్టీకి హాజరైంది. ఇదీ ఒక సంచలనమే.