ఐశ్వర్యా రాయ్. అందానికి అందం. పోతపోసిన అద్భుత సౌందర్య శిల్పం. ప్రపంచ సుందరిగా కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన ఐష్, ఒకప్పుడు సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో పడింది. నువ్వు లేక నేను లేను, హమ్ దిల్ దే చుకే సనమ్ అని ప్రణయ గీతాలు పాడింది. అతడి సాంగత్యంలో సేదదీరింది. తర్వాత ప్రేమాయణం వికటించింది. ఐశ్వర్యారాయ్ కాస్తా ఐశ్వర్యా బచ్చన్ గా మారింది. ఇంతకాలానికి మళ్లీ మాజీ ప్రియుడిని గట్టిగా సమర్థించింది. అదే ట్విస్ట్.
హమ్ దిల్ దే చుకే సనమ్ లో ఐశ్వర్య డాన్స్ చూసి కోట్ల మంది ఫిదా అయిపోయారు. అందులో సల్మాన్ కు ప్రేయసిగా నటించిన ఐశ్వర్య, ఆ తర్వాత జీవించింది. అతడితోనే లోకమంటూ ప్రణయసాగరంలో ఓలలాడింది. కొంత కాలం పాటు ఈ జంట, అభిమానులకు కన్నుల పంటే అయింది.
సినిమాల్లో ఊహించని ట్విస్టులుంటాయ్. ఐశ్వర్య ప్రేమగాథ కూడా ఊహించని మలుపు తిరిగింది. ఐలవ్ యు అని రోజుకు వందల సార్లు చెప్పిన సుందరాంగి, ఐ హేట్ యూ అనేసింది. సల్మాన్ ప్రేమకు కటీఫ్ చెప్పింది. అంతటి అతిలోక సుందరి హటాత్తుగా టాటా చెప్పడంతో సల్మాన్ పిచ్చోడైపోయాడు. ఆమె వెంట పడి వేధిస్తున్నాడని యాష్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొంత కాలానికి అభిషేక్ బచ్చన్ ను పెళ్లాడింది.
సరే. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే సల్మాన్ ఖాన్ కు మాజీ లవర్ ఫుల్ సపోర్టిచ్చింది. ఒలింపిక్స్ కు వెళ్లే భారత బృందానికి గుడ్ విల్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ను నియమించడంపై చాలా మంది క్రీడాకారులు అభ్యంతరం చెప్పారు. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా అదేకోరస్ పాడారు. సినిమా వాళ్ల కంటే క్రీడాకారులను నియమించాలన్నారు. అయితే అందాల యాష్ మాత్రం తన మాజీ ప్రియుడిని నియమించడం రైటేనంటోంది. అతడు క్రీడలను ప్రోత్సహించడానికి రెడీ ఉన్నప్పుడు అభినందించాలని కామెంట్ చేసింది. ఆల్ ది బెస్ట్ కూడా చెప్పింది. పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన మాజీ ప్రేయసి ఇంత ఫుల్ సపోర్ట్ ఇవ్వడం ఊహించని మలుపే.
ఈమధ్య బాలీవుడ్ లో మాజీ ప్రేమికుల రీ యూనియన్ సీజన్ నడుస్తోంది. ఒకప్పుడు ఏ క్షణమైనా పెళ్లి చేసుకుంటారని భావించిన కరీనా కపూర్, షాహిద్ కపూర్ అనూహ్యంగా విడిపోయారు. తన కంటే వయసులో చాలా పెద్దవాడు, అప్పటికే పెళ్లయిన వాడు సైఫ్ ను కరీనా పెళ్లాడింది. అయితే ఇటీవల వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. అయితే జోడీగా కాదు. ఇకముందు షాహిద్ కు జోడీకా నటించడానికి, తెరమీద రొమాన్స్ చేయడానికి రెడీ అంటోంది అందాల కరీనా. గతం గత:. ఒకప్పుడు లవర్స్. అయినా కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని తేల్చేసింది.
మరి ఐష్ విషయంలో అలాగే జరగవచ్చా? మరోసారి సల్మాన్, ఐష్ లను ఒకే సినిమాలో చూడవచ్చా అనే చర్చ అప్పుడే మొదలైంది. ఐశ్వర్యారాయ్ సన్నిహితులు మాత్రం అంత సీన్ లేదంటున్నారు. కేవలం గుడ్ విల్ అంబాసిడర్ గా నియామకాన్ని సమర్థించడం వరకే ఐష్ సుహృద్భావం పరిమితం అంటున్నారు. ఏమో, బాలీవుడ్ జనాల జీవితాల్లో ఊహించని ట్విస్టులుంటాయి. వీరిద్దరు కూడా పాత గొడవలకు టాటా చెప్పారేమో. అలా వీళ్ల గొడవకు శుభం కార్డు పడుతుందో లేదో వేచి చూద్దాం.