త్రిషకు కోపం వచ్చింది. అదీ సగం సినిమా చిత్రీకరించిన తరవాత. ఆమె కోపానికి కారణం ఏంటంటే… తన క్యారెక్టర్ కంటే జూనియర్ అయిన కీర్తీ సురేష్ క్యారెక్టర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్, లెంగ్త్ ఇస్తున్నారని! కోపంతో సినిమా నుంచి తప్పుకుంది. ఇదంతా తమిళ సినిమా ‘సామి స్క్వేర్’ గొడవ. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన ‘అపరిచితుడు’ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. పదిహేనేళ్ల క్రితం ఇదే హీరో, దర్శకుడు కాంబినేషన్లో వచ్చిన ‘సామి’కి సీక్వెల్. అందులో త్రిష హీరోయిన్. సీక్వెల్లోనూ ఆమె క్యారెక్టర్ వుంది. అయితే… ఆమెతో పాటు మరో హీరోయిన్గా కీర్తీ సురేష్‌ని సినిమాలోకి తీసుకున్నారు. కొన్ని రోజులు చిత్రీకరణ జరిగాక… త్రిష సినిమా నుంచి తప్పుకుంది. దర్శక నిర్మాతలను ఆమెకు నచ్చజెప్పాలని చూశారు. వినలేదు.
ఇప్పుడు త్రిష స్థానంలో ఐశ్వర్యా రాజేష్‌ని తీసుకున్నారు. ఆల్రెడీ ఆమె మీద కొన్ని రోజులు షూటింగ్ చేశారు. మరో పదిహేను రోజులు షూటింగ్ చేస్తే ఐశ్వర్యా రాజేష్ పార్ట్ పూర్తవుతుంది. విక్రమ్‌తో ఐశ్వర్యా రాజేష్‌కి రెండో సినిమా ఇది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన ‘ధ్రువ నక్షత్రం’లో కీలక పాత్ర చేసిందామె. అది విడుదల కాకముందే ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు విక్రమ్. మణిరత్నం ‘నవాబ్’లోనూ ఐశ్వర్యా రాజేష్ నటిస్తోంది. ‘సామి స్క్వేర్’ నుంచి తప్పుకున్నందుకు త్రిషపై నిర్మాతలు ఆగ్రహంతో వున్నారని చెన్నై సమాచారం. నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేస్తే త్రిష పెద్ద మొత్తంలో ఫైన్ కట్టాల్సి వస్తుంది. ఇటీవల ఇటువంటి తగాదాలు తమిళ సినిమా ఇండస్ట్రీలో రెండుమూడు జరిగాయి.