ఇటీవల రజనీకాంత్ సినిమా ఒకటి విడుదలైంది. పేరు… ‘లాల్ సలామ్’. అసలు రజనీ సినిమా వస్తోందంటే హడావుడి, హంగామా ఎలా ఉండాలి? అవేం ‘లాల్ సలామ్’ విషయంలో కనిపించలేదు. పైగా ఈ సినిమాకు రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీ దర్శకురాలు. ఎలాంటి హంగూ లేకుండా వచ్చిన ఈ సినిమా, అలానే వెనక్కి వెళ్లిపోయింది. తెలుగులో ఈ సినిమాని పట్టించుకొనే నాధుడే లేడు. తమిళంలో కూడా ఈ సినిమాని ఎవరూ చూడలేదు. రజనీ సినిమాల్లో అత్యంత తక్కువ వసూళ్లు నమోదైన సినిమా ఇదే. తండ్రిగా రజనీకాంత్ అవకాశం వస్తే, కూతురిగా నిలబెట్టుకోలేకపోయిందని ఐశ్వర్యపై ఫ్యాన్స్ విరుచుకుడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఐశ్వర్య స్పందించింది. `లాల్ సలామ్` సినిమా రిజల్ట్‌పై పోస్ట్‌మార్టమ్ చేసింది. అభిమానులకు ఈ సినిమా నచ్చలేదని, వాళ్ల తీర్పుని గౌరవిస్తానని చెప్పింది ఐశ్వర్య. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తగిన కారణాన్నీ అన్వేషించింది. నిజానికి ఈ కథ అనుకొన్నప్పుడు రజనీ పాత్ర కేవలం 10 నిమిషాలే ఉందట. కానీ ఆ తరవాత ఆ పాత్ర నిడివిని పెంచుకొంటూ వెళ్లిపోయారట. దాంతో కథ మార్చాల్సివచ్చిందని, కథలో గందరగోళానికి తావిచ్చినట్టైందని వాపోతోంది ఐశ్వర్య. ”కథ అనుకొన్నప్పుడు నాన్నగారి పాత్ర కేవలం 10 నిమిషాలే. కానీ క్రమంగా మా ఆలోచన మారింది. నాన్నగారి ఫ్యాన్స్ ని దృష్టిలో ఉంచుకొని, వాళ్లు నిరుత్సాహ పడకూడదన్న ఉద్దేశంతో ఆ పాత్ర నిడివి పెంచుకొంటూ వెళ్లాం. స్క్రిప్టు లాక్ అయిపోయిన తరవాత కూడా మార్పులు చేర్పులూ చేశాం. దాంతో కథ పాడైపోయింది. తొలి భాగంలో కథ విషయంలో గందరగోళానికి గురయ్యామని ఫ్యాన్స్ చెప్పారు. దానికి కారణం మేం చేసిన మార్పులే. నా తప్పులు నాకు అర్థమయ్యాయి. మరుసటి సినిమా విషయంలో వీటిని పాఠాలుగా గుర్తుపెట్టుకొంటా” అంటూ ‘లాల్ సలామ్’ పై తనదైన రివ్యూ ఇచ్చేసింది ఐశ్వర్య. ‘తదుపరి సినిమా అంటోంది. అంటే రజనీతో మరో సినిమాగానీ చేస్తోందా’ అని ఫ్యాన్స్ అప్పుడే భయపడిపోతున్నారు. మరి.. రజనీ ఏమంటాడో?