ఢిల్లీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం ముగిసింది! అయితే, ఈ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే… ‘అజేయ భారత్…. అటల్ బీజేపీ’ అంటూ ఓ కొత్త నినాదాన్ని భాజపా ఎత్తుకోవడం. 2019 ఎన్నికల్లో ఇదే ప్రధాన నినాదం అంటున్నారు. నిజానికి, భాజపా అంటే మోడీ షా ద్వయం అన్నట్టుగా మొత్తం ఇమేజ్ మారుస్తూ వచ్చారు. ఈ క్రమంలో సీనియర్లకు కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరించారు. అందుకు సాక్ష్యం ఆ మధ్య ఎల్.కె. అద్వానీజీని మోడీ గౌరవించిన తీరే. మోడీని ఒక బ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసిన తరువాత… ఇప్పుడు హఠాత్తుగా స్వర్గీయ అటల్ బీహారీ వాజ్ పేయి పేరును ఎందుకు ఎత్తుకుంటున్నారు..? ఆయన బతికుండగా గౌరవం ఇవ్వలేదుగానీ, మరణించాక సానుభూతి పొందాలని ఎందుకు ప్రయత్నిస్తారు…? ‘అటల్ బీజేపీ’ నినాదం వెనక ఏదో ఒక ప్రయోజనం లేకపోతే మోడీ షా ద్వయం ఇలాంటి పెట్టదే అనే అనుమానాలు రావడం సహజం!
ఇప్పుడు అటల్ జీని తల్చుకోవడానికి ప్రధాన కారణం… మోడీపై పెరుగుతున్న వ్యతిరేకతను వారే గుర్తించి పరోక్షంగా దాన్ని అంగీకరించడమే అవుతుంది! ‘మోడీ అహంకారి’ అనే ఇమేజ్ ఈ మధ్య ప్రజల్లోకి బాగా వెళ్తోంది. ఇంతకుముందు మాదిరిగా మోడీ ప్రసంగిస్తే మురిసిపోయేవారు తగ్గుతున్నారు. ఆయన మాటల్లో అహంకారం చాలా స్పష్టంగా ధ్వనిస్తున్న పరిస్థితి. దీంతో భాజపాకి సహజ మిత్రులుగా ఉన్న టీడీపీ, శివసేన వంటి పార్టీలు దూరమౌతున్నాయి. నిజం చెప్పాలంటే, పట్టుమని పది సీట్లు పట్టుకొచ్చే మిత్రపక్షాలేవీ భాజపా పక్కన ఇప్పుడు లేవనే చెప్పాలి. మోడీ ఆధిపత్యాన్ని భుజాలపై మొయ్యాల్సిన అవసరం తమకేంటనే అభిప్రాయంతో ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీలు భాజపాకి దూరంగా ఉంటున్న పరిస్థితి.
అందుకే, ఇకపై వాజ్ పేయి హయాంలో మాదిరిగానే భాజపా ఉంటుందని మిత్రపక్షాలకు చెప్పడం కోసమే ఈ ‘అటల్ బీజేపీ’ నినాదం అనడంలో సందేహం లేదు. మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇస్తూ, మిత్రధర్మ కాపాడుతూ అటల్ హయాంలో మాదిరిగానే ఇకపై తామూ వ్యవహరిస్తామన్న కలరింగ్ ఇవ్వడం కోసమే మోడీ షా ద్వయం ఈ నినాదాన్ని తెరమీదికి తెచ్చినట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే, పేరు మార్చినంత మాత్రాన మోడీ తీరు మారిపోయిందని ఎంతమంది నమ్ముతారంటారు..? అంబేద్కర్ భవన్ లో కొత్తగా పార్టీ కార్యక్రమాలు పెట్టడం, అంబేద్కర్ తోపాటు వాజ్ పేయి ఫొటోలు మాత్రమే పెద్దగా పెట్టి బిల్డప్ ఇవ్వడం ద్వారా ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చు అనుకుంటున్నారు! కానీ, అద్వానీ లాంటి సీనియర్లకే మర్యాద దక్కని నేటి భాజపాలో… ఇప్పుడు అటల్ జీ ఫొటో పట్టుకుని మోడీ తిరిగినంత మాత్రాన మారిపోయారని ప్రజలు అనుకునే పరిస్థితి ఉండదనేదే విశ్లేషకుల మాట.