ఆర్.ఎక్స్ 100తో ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొన్నాడు అజయ్ భూపతి. హీరోలు, నిర్మాతలు అజయ్ వెంట పడ్డారు. అయితే అదంతా ఒక్క సినిమాకే పరిమితం. మహా సముద్రంతో వచ్చిన పేరు కాస్త పోయింది. భారీ అంచనాలతో రూపుదిద్దుకొన్న మహా సముద్రం.. పేరుకి తగ్గట్టే చాలామందిని ముంచేసింది. దాంతో… అజయ్ భూపతి కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. కథ చెప్పడానికి ఎవరి దగ్గరకు వెళ్లినా, ఎవరూ పట్టించుకోలేదట. కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదట. ఇండస్ట్రీలో తన వాళ్లెవరో, కాని వాళ్లెవరో… మహా సముద్రం సినిమా తేల్చి చెప్పేసిందని అంటున్నాడు… అజయ్ భూపతి. ఈ విషయంలో ఎవ్విరినీ నిందించడం లేదని, హిట్టూ, ఫ్లాపులే.. గౌరవాన్ని ఆపాదిస్తాయని చెప్పుకొచ్చాడు అజయ్.
అప్పట్లో… రవితేజతో చిన్న పాటి వివాదం కూడా నడిచింది. ఈ కథ ముందు రవితేజ దగ్గరకు వెళ్లింది. చివరి క్షణంలో ఆయన తప్పుకొన్నాడు. `చీప్ స్టార్` అంటూ అజయ్ భూపతి చేసిన ట్వీట్.. రవితేజ గురించే అని అప్పట్లో టాక్ నడిచింది. దీనిపై కూడా ఇప్పుడు అజయ్ భూపతి స్పందిస్తున్నాడు. రవితేజతో ఇష్యూ చిన్నదే అని, తనకు సరిపడా ఐడియా వస్తే, రవితేజతో ఇప్పటికీ సినిమా చేయడానికి రెడీగానే ఉన్నానని తేల్చేశాడు. దాంతో రవితేజతో ప్యాచప్ జరిగిపోయిందని టాలీవుడ్ జనాలు చెప్పుకొంటున్నారు. అజయ్ భూపతి కొత్త సినిమా `మంగళవారం` విడుదలకు సిద్దంగా ఉంది. మహా సముద్రం హిట్టయినా, ఫ్లాపయినా, తన మూడో సినిమాగా ఇదే వచ్చేదని స్పష్టం చేశాడు. నాలుగో సినిమాకి సంబంధించిన కథ కూడా రెడీగా ఉందట. ఈసారి యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడట. హీరో ఎవరో త్వరలో చెబుతా అంటున్నాడు.