ఆంధ్రప్రదేశ్ గురించి యావత్తు ప్రపంచానికి తెలియజెప్పడానికి ఇవాళ బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ దంపతులు ఒక అంగీకారం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రచార కర్తలుగా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండేందుకు వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారుట. తమ ఆలోచనను చంద్రబాబుతో పంచుకుంటే ఆయన వారి కోరనికను మన్నించారుట. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే.. బ్రాండ్ అంబాసిడర్లుగా వారు మన రాష్ట్రానికి సేవలందించేస్తారు అని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి దేవగణ్ దంపతుల స్థాయి బాలీవుడ్ జంట బ్రాండ్ అంబాసిడర్లు అయ్యాక.. వారు మన రాష్ట్రానికి ఎలాంటి ప్రచారం కల్పిస్తారో తెలియదు. అసలు సందేహం ఏంటంటే.. అసలు ప్రచారం అనేది రాష్ట్రానికి చేస్తారా? ప్రభుత్వానికి లేదా చంద్రబాబుకు చేస్తారా? అనేది కూడా సందేహమే!
ఈ మొత్తం వ్యవహారాన్ని పక్కన పెడితే.. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల్లో బ్రాండ్ అంబాసిడర్ అనే పదం వింటేనే అది పెద్ద కామెడీగా మారిపోయిందని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సర్కారు కొత్తగా గద్దె ఎక్కిన సమయంలో కేబినెట్ ఏర్పాటు అయిన కొన్ని నెలల్లోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆర్భాటంగా ఒక ప్రకటన చేశారు. ఏపీ ఆరోగ్య శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి ఉచితంగా పనిచేయడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అంగీకరించారని టముకు వేశారు. అమితాబ్ కూడా దానిని ధ్రువీకరించారు.
దేవగణ్ దంపతులు కనీసం ఏపీకి వచ్చి ఈ ఆఫర్ ఇచ్చారు. అమితాబ్ కనీసం ఇక్కడకు రాలేదు కూడా. కామినేని విజయవాడలో ప్రకటనచేస్తే, ఆయన ముంబాయిలో ధ్రువీకరించారు.. అంతే. ఇప్పటికి రెండేళ్లు గడుస్తుండగా.. ఏపీ వైద్య ఆరోగ్య శాఖకోసం అమితాబ్ చేసింది సున్నా అనే సంగతి అందరికీ తెలుసు. మరి ఈ ఉచిత బ్రాండ్ అంబాసిడర్ల వ్యవహారం అనేది కేవలం ప్రకటించే రోజు ఆర్భాటం మాత్రమేనా? లేదా వారి ద్వారా రాష్ట్రానికి నిజంగా ఏమైనా ప్రచార ప్రయోజనం కలుగుతుందా? అనేది దేవగణ్ , కాజోల్ దంపతుల ద్వారానైనా చంద్రబాబు ప్రజలకు నిరూపించి చూపించాలి.