ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం పని ప్రారంభించేందుకు… కొత్త టీంను రెడీ చేసుకుంటోంది. అధికారులందరూ ఏ ప్రభుత్వం మారినా వాళ్లే ఉంటారు. కాకపోతే.. వారి స్థానాలను మార్చడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు. బదిలీలు చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో… కొన్ని నియామకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అందులో మొదటిది..అజేయకల్లాం నియామకం. వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా.. నెలకి రూ. రెండున్నర లక్షల జీతంతో ఆయనను నియమించారు.
యంత్రాంగంపై మొత్తం పెత్తనం అజయ్ కల్లాంకు..!
అజయ్ కల్లాంకు… ఇచ్చిన బాధ్యతల ప్రకారం చూస్తే… సీఎం జగన్‌కు ఉన్న అధికారాలన్నింటినీ ఆయనకు బదిలీ చేసినట్లుగా భావింవచ్చు. సీఎం ముఖ్య సలహాదారుగా.. ఏపీలోని అన్ని శాఖలకు.. ఆయన సూచనలు, సలహాలు ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. అదే సమయంలో.. సీఎం కార్యదర్శులపై ఆయనకు పూర్తి స్థాయి అజమాయిషీ ఇచ్చారు. అజేయకల్లాం.. నియామక ఉత్తర్వులను పరిశీలిస్తే… ఆయనను యాక్టింగ్ సీఎంగా భావించవచ్చు. అధికారవర్గాల్లో జగన్ తరపున ఇక ఆయనే పనులు చేపట్టనున్నారు. సీఎస్ ఎస్వీ సుబ్రహ్మణ్యం సహా.. అందరూ ఆయన మాటలకే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది.
అజేయకల్లాంకు ఎందుకింత ప్రాధాన్యత..?
అజేయకల్లాంగా ప్రసిద్ధుడైన కల్లం అజేయ రెడ్డి … కొత్త ముఖ్యమంత్రికి ఎందుకు ఇంత ప్రీతిపాత్రం అయ్యారనేది ఆసక్తికరమైన అంశం. నిజానికి ఆయన నవ్యాంధ్రకు సీఎస్‌గా పని చేశారు. కానీ అది చాలా పరిమితం. ఒక్క నెల రోజులు మాత్రమే ఆయనకు ఆ అవకాశం దక్కింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు… మరో రెండేళ్ల పాటు ఆయనకు పొడిగింపును.. కేంద్రం నుంచి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కానీ కేంద్రంతో సంబంధాలు దెబ్బతినడంతో… సాధ్యం కాలేదు. దాంతో ఆయన అసంతృప్తి పెంచుకున్నారని.. అధికారవర్గాలు చెబుతున్నాయి. అప్పుడు మిస్సయిన… ఆ చాన్స్ తానిస్తానని.. అంతకు మించిన అధికారం సలహాదారు పదవితో వస్తుందని.. హామీ ఇవ్వడంతో.. అజేయకల్లం… జగన్‌కు అనుకూలంగా పని చేయడం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు.. ఆయన ఏపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. అవినీతి సర్కార్ అంటూ.. వర్క్ షాపులు నిర్వహించారు. ఓ రాజకీయ నాయకుడు ఎలాంటి ఆరోపణలు చేస్తారో అన్నీ చేశారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం పొందారు.
సీనియర్ అధికారుల్లో అసంతృప్తి..!?
రాజకీయ నేతలు మాత్రం ఐదేళ్లకోసారి మారుతూ ఉంటారు. కానీ అధికారులు మాత్రం శాశ్వతం. వారు రిటైరయ్యే వరకూ.. ఏదో ఓ పదవి అనుభవిస్తూనే ఉంటారు. సీనియర్లు అయ్యే కొద్దీ పెత్తనం తమదే ఉండాలని ఆశ పడతారు. కానీ… తమపై.. ఎప్పటికప్పుడు.. రిటైరైన వాళ్ల పెత్తనం ఉంటే.. వారికి.. అసంతృప్తి రేగకుండా ఎలా ఉంటుంది..?. తమ అధికారాలను.. అజేయకల్లం సలహాదారు పదవి పేరుతో పట్టుకుపోతే.. మిగిలిన నాయకులు.. ఎలా తట్టుకుంటారు..? ప్రస్తుతం ఏపీ అధికారుల్లో అదే ఉందంటున్నారు. అజేయకల్లాం పెత్తనం పెరిగే కొద్దీ ఇది మరితం విస్తృతమవుతుంది. ఇలాంటి విషయాన్ని ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది.