ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన హై ప్రోఫైల్ సలహాదారులు… మరో ఏడాది పొడిగింపు పొందారు. వీరిలో జీవీడీ కృష్ణమోహన్, సజ్జల రామకృష్ణారెడ్డి, కల్లాం అజేయరెడ్డి లాంటి వారు ఉన్నారు. జీవీడీ కృష్ణమోహన్.. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి స్పీచ్‌లు రాయడంతో చాలా బిజీగా ఉన్నారు. ఆయనను మారుస్తారని ఎవరూ అనుకోరు. అలాగే.. సజ్జల రామకృష్ణారెడ్డికి పొడిగింపు ప్రత్యేకంగా ఎవరూ ఇవ్వాల్సిన పని లేదు. ఆయనే అక్కడ సూపర్ పవర్. మొత్తం వ్యవహారాలు ఆయనే చక్క బెడతారు. అయితే పొడిగింపు లభించిన అజేయకల్లాం గా ప్రసిద్ధి చెందిన కల్లా అజేయరెడ్డి వ్యవహారం మాత్రం కొంచెం ఆసక్తికరంగానే మారింది.
నిజానికి.,.. మాజీ సలహాదారు అయిన పీవీ రమేష్‌తో పాటు కల్లాం అజేయరెడ్డిని కూడా ..సీఎం జగన్ ఓ సందర్భంలో దూరం పెట్టారు. వారి వద్ద ఉన్న శాఖలన్నింటినీ తీసేసుకున్నారు. ఆ అవమాన భారంతో పీవీరమేష్ జగన్ టీం నుంచి నిష్క్రమించారు. కానీ.. కల్లాం అజేయరెడ్డిని మాత్రం…ప్రభుత్వ పెద్దలు బుజ్జగించారు. అధికారింగా ఎలాంటి శాఖలు లేకపోయినప్పటికీ.. తెర వెనుక పనులు చేయడానికి మీరు ఉండాలని చెప్పడంతో ఆయన కూడా సై అన్నారు. ప్రస్తుతం.. ఆయన సలహాదారుగా చక్కబెట్టడానికి ఎలాంటి శాఖలనూ అధికారికంగా కేటాయించలేదు. కానీ ఆయన పదవి మాత్రం భద్రంగా కొనసాగుతోంది. నెలకు రూ. మూడు లక్షలకుపైగా జీతాలు.. అలవెన్స్‌లు ప్రజాధనాన్నిపొందుతున్నారు. అలాంటి వారు చాలా మంది సలహాదారులుగా ఉన్నారు.
కల్లాం అజేయరెడ్డి.. కొద్ది రోజులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎస్‌గా చేశారు. పొడిగింపు ఇవ్వలేదన్న కారణంగా… రిటైర్మెంట్ తర్వాత జగన్ క్యాంప్‌లో చేరి.. తాను సీఎస్‌గా పని చేసిన ప్రభుత్వంపైనే విపరీతమైన ఆరోపణలు గుప్పించారు. ఆయన సలహాల వల్ల… పీపీఏలు రద్దు చేయడం వంటివి చేసి.. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో… జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆయనకు సలహాదారు పదవిని కొనసాగించడం… ప్రత్యేక కారణాల వల్లేనని అంచనా వేస్తున్నారు.