రెండు రోజులుగా కల్లాం అజేయరెడ్డి, ప్రేమ చంద్రారెడ్డి పేర్లు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ప్రేమచంద్రారెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా చేశారు. ఆయనే ప్రతి పైసా విడుదల చేశారు. ఏదైనా ఆయనే బాధ్యుడు. కానీ ఆయన పేరు ఎక్కడా ఎఫ్ఐఆర్ లో కనిపించలేదు. నేరుగా ముఖ్యమంత్రిని బాధ్యుడ్ని చేశారు. అప్పట్లో స్కిల్ కేసులో కీలక నిర్ణయాలు తీసుకున్న కల్లాం అజేయరెడ్డి కూడా కీలక అధికారి. ఆయన పేరూ ఎఫ్ఐఆర్ లో కనిపించలేదు. అసలు వారు లేకుండా కేసు ముందుకు సాగడం అసాధ్యమని న్యాయవ్యవహారాల్లో కనీస అనుభవం ఉన్నవారికైనా తెలుస్తుంది.
స్కిల్ డెలవప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ చెబుతున్న మొత్తం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులు విడుదల చేసింది రిటైర్డ్ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి కాగా.. కేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. రిపోర్టులు ఇచ్చి.. ఒప్పందం చేసుకోవాలని సూచించింది ప్రస్తుతం సీఎం కు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్‌లు సీఐడీ ఎఫ్ఐఆర్లో నిధులు మంజూరు చేసిన ఎండీ పేరు లేదు. రెండు కీలక కమిటీల చేతుల మీదుగా ఈవ్యవహారాలు నడిచాయి. ఆ కమిటీలకు సారధ్యం వహించిన ఐఏఎస్‌ల పేర్లూ లేవు. ఎండీగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రేమ్ చంద్రారెడ్డి చెల్లింపులు చేశారు. అదే సమయలో రెండు కమిటీలు ఈ మొత్తాన్ని పర్యవేక్షించాయని.. ఆ కమిటీలకు ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, రావత్‌లు నేతృత్వం వహించారు. వారి సిఫార్సుల మేరకే అన్నీ జరిగాయి.
వారిని విచారింకుండా అసలు విషయాలు బయటకు రావు. కానీ వారిని ప్రశ్నించేందుకు మాత్రం ఇప్పటి వరకూ సీఐడీ కనీసం ప్రయత్నించలేదు. నిజంగా అవినీతి జరిగి ఉంటే ఎవరెవరు ఎంతెంత లంచాలు తీసుకున్నారో చెప్పాలి. ఎక్కడెక్కడ లావాదేవీలు జరిగాయో వివరించాలి .కానీ ఏపీ సీఐడీ అధికారులు అవినీతి జరిగిందని చెప్పరు. “స్కిల్ స్కాం” పేరుతో హడావుడి చేస్తున్న సీఐడీ ఎక్కడైనా అవినీతి లావాదేవీ జరిగిందో చెప్పడం లేదు. కానీ నిధుల దుర్వినియోగం అని చెబుతోంది. అది ఎలాంటి దుర్వినియోగమో చెప్పడం లేదు. ఈ కేసులో నేరుగా అప్పటి ముఖ్యమంత్రికి ప్రమేయం అని అరెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు .. అజేయరెడ్డి, ప్రేమచంద్రారెడ్డిలను కాపాడటం సాధ్యం కాదన్న వాదన వినిపిస్తోంది. వారూ జైలుకెళ్లాల్సి ఉంటుందని… పార్టియల్ విచారణ న్యాయస్థానాల్లో కుదరదని అంటున్నారు.