కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవడానికి చాలా మంచి అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిలో కూర్చోవడానికి భయపడ్డారు. కానీ ఎప్పటి కయినా రాహుల్ బాబే ఆ కుర్చీలో ఠీవిగా కాలుమీద కాలేసుకొని దేశాన్ని పరిపాలిస్తుంటే చూడాలని ఆ తల్లి కోరిక నెరవేరలేదు. దేశాన్ని ఏలకపోతే పోయె కనీసం కాంగ్రెస్ పార్టీనయినా ఏలుకొంటాడని అనుకొంటే పార్టీలో నేతలే అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అందరి కంటే సీనియర్ నేత ఫోతేదార్ వ్రాసిన ఒక పుస్తకంలో రాహుల్ గాంధీ కి ఆ అర్హత లేదని నిర్ద్వందంగా లిఖితపూర్వకంగా ప్రకటించేశారు. పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకే అర్హత లేని వ్యక్తి ఇక దేశానికి ప్రధాన మంత్రి ఏవిధంగా అర్హుడు?అని జనాలకి సందేహం కలిగితే అందులో ఆశ్చర్యమేమీ లేదు.
కానీ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి సారధ్యం చేస్తారని ఘంటాపథంగా చెపుతున్నారు. మాజీ కేంద్రమంత్రి ఎకె. అంటోనీ కేరళలో మీడియాతో మాట్లాడుతూ “సోనియా గాంధీ తరువాత రాహుల్ గాంధీయే మా పార్టీ పగ్గాలు చేపడుతారు. కానీ అదెప్పుడో ఇంకా తెలియదు,” అని చెప్పారు.
ఆయన ఏ సందర్భంగా ఈ మాట అన్నారో తెలియదు కానీ రాహుల్ గాంధీ నేటికీ పార్టీ పగ్గాలు చేప్పట్టడానికి సిద్దంగా లేరని, ఆయన కాకుండా ఇంకా చాలా మంది పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు ద్రువీకరించినట్లయింది.