ఈరోజు.. దర్శకుడు వి.ఐ.ఆనంద్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్లో ఆనంద్ ఓ సినిమా చేస్తున్నారంటూ నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రానికి దర్శకత్వం వహించారు ఆనంద్. ఈ చిత్రానికి ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ భాగస్వామి. ఆ సినిమా యావరేజ్ మార్కులు తెచ్చుకొంది. అయితే నిర్మాతలు మాత్రం సేఫ్. అందుకే ఏకేలో ఆనంద్ మరో సినిమా చేసే ఛాన్స్ అందుకొన్నారు. చిరంజీవికి సరిపడ కథ.. ఆనంద్ దగ్గర ఉంది. ఏకేలో చిరు ఓ సినిమా చేయాలన్న కమిట్మెంట్ ఉంది. ‘భోళా శంకర్’ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అందుకే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు చిరు మరో సినిమా చేస్తానన్నారు. అప్పటి నుంచీ అనిల్ సుంకర చిరుకి సరిపడ కథ గురించి అన్వేషిస్తున్నారు.
వి.ఐ.ఆనంద్ సైన్స్ ఫిక్షన్ కథలు చేయడంలో సిద్ధహస్తుడు. చిరు కోసం ఓ టైమ్ ట్రావెల్ కథ రాశారాయన. ఇలాంటి కథలు చిరుకీ ఇష్టమే. అయితే వశిష్ట దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ‘విశ్వంభర’లో టైమ్ ట్రావెల్ కి సంబంధించిన ఓ ఎలిమెంట్ ఉంది. అందుకే మళ్లీ అలాంటి జోనరే టచ్ చేయకపోవొచ్చు. దాంతో.. ఆనంద్ కథని ఓకే చేస్తారా, లేదంటే మరో కథని రాసుకుని రమ్మంటారా? అనేది ఆసక్తిని కలిగిస్తోంది. అయితే ఆనంద్ మాత్రం రెండు మూడు లైన్లు చిరు కోసం అట్టిపెట్టాడట. అవన్నీ రకరకాల జోనర్లకు సంబంధించిన కథలని తెలుస్తోంది. మరి.. చిరు వీటిలో దేనికి ఓటేస్తాడో చూడాలి. చిరు-ఆనంద్ మధ్య త్వరలోనే ఓ భేటీ జరగబోతోంది. ఆ భేటీ తరవాత ఈ కాంబినేషన్ పై మరింత స్పష్టత రానుంది.