రాజమౌళి కలలన్నీ భారీగా ఉంటాయి. వందల కోట్లు లేకపోతే రాజమౌళి సినిమా పూర్తి కావడం లేదు. అయితే ఇప్పుడు తనయుడు కార్తికేయ నిర్మాతగా మారుతున్నాడు. ‘ఆకాశవాణి’ సినిమాతో. రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా బడ్జెట్ ఎంతనున్నారు..? కేవలం రూ.4 కోట్లు. ఓ కొత్త కథాంశంతో, పరిమిత బడ్జెట్లో ఈ సినిమాని పూర్తి చేయాలన్నది కార్తికేయ ప్లాన్. రూ.4 కోట్లకు ఒక్క రూపాయి కూడా మించకుండా… కాస్త కట్టుదిట్టంగా షెడ్యూల్స్ వేసుకున్నార్ట. రాజమౌళి తనయుడి సినిమా కాబట్టి.. మార్కెటింగ్, పబ్లిసిటీ ఆ స్థాయిలోనే ఉంటుంది. విడుదలకు ముందే… భారీ టేబుల్ ప్రాఫిట్తో సేఫ్ జోన్లోకి వెళ్లిపోవాలని కార్తికేయ భావిస్తున్నాడు. కీరవాణి తనయుడు కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు.
ఇందులో హీరోలు, విలన్లు ఎవరూ ఉండరు. పాత్రలే కథని నడిపిస్తాయి. కథే పాత్రల్ని మోస్తుంటుంది. అయితే… నెగిటీవ్ షేడ్ ఉన్న పాత్ర ఒకటి ఇందులో కీలకం. ఆ పాత్రలో ఓ స్టార్ హీరో కనిపిస్త బాగుంటుందని కార్తికేయ భావించాడు. అయితే బడ్జెట్ పరిమితుల వల్ల… ఆ ప్రతిపాదన పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. సాయికుమార్ సోదరుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, నటుడు రవిశంకర్ కి ఆ ఛాన్స్ దొరికినట్టు తెలుస్తోంది. మిగిలిన నటీనటుల వివరాల్ని త్వరలోనే చిత్రబృందం ప్రకటిస్తుంది.