పూరి సినిమా టైటిళ్లన్నీ తిట్టలానే ఉంటాయన్న కామెంట్ ఉంది. అయితే ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మానాన్న తమిళ అమ్మాయి లాంటి సెన్సిబుల్ టైటిల్స్ కూడా పెట్టాడు పూరి. ఆ తరవాత… ఆయన దృష్టంతా మరోవైపు పరుగులు తీయడం వల్ల పోకిరి, ఇడియట్, రోగ్, లోఫర్ లాంటి పదాలు పుట్టాయి. ఇప్పుడాయన ఓ లవ్ స్టోరీ తీస్తున్నాడు. తనయుడు ఆకాష్పూరి కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందిస్తున్నాడు. ఈరోజు పూరి జన్మదినం సందర్భంగా ఆ సినిమా టైటిల్ని అధికారికంగా ప్రకటించారు. ఆదే..’మెహబూబా’. ఇండియా – పాకిస్థాన్ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 1971లో ఇండో – పాక్ వార్ జరిగింది. అప్పుడు నడిచిన ఓ ప్రేమకథ ఇది. కథానాయికగా నేహా శెట్టిని ఎంపిక చేసుకొన్నారు. పిరియాడిల్ సినిమా చేయడం పూరికి ఇదే తొలిసారి. తమిళ, హిందీ జనాలకూ అర్థమయ్యేలా టైటిల్ ఎంచుకోవడం బట్టి చూస్తే… ఇది మిగిలిన భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేస్తారేమో అనిపిస్తోంది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. మిగిలిన వివరాలు త్వరలో తెలుస్తాయి.