కడప జిల్లా ప్రొద్దుటూరులో సీఎం జగన్ బంధువు తమ భూమిని ఆక్రమించుకున్నారని తమకు న్యాయం చేయాలని లేకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ పోస్టులు పెట్టిన అక్బర్ భాషా కుటుంబానికి అఘామేఘాలపై సీఎం జగన్ అభయం ఇచ్చారు. సీఎంవో స్పందించి న్యాయం చేయాలని ఆదేశించింది. ఎస్పీ ఉన్నతాధికారులు అందరూ వెళ్లారు. దాంతో అదే రోజు అక్బర్ భాషా ప్రెస్‌మీట్ పెట్టి సీఎం జగన్‌ను దేవుడిగా చెప్పారు.. తమ భూమిని తమకు అప్పగించారని చెప్పుకొచ్చారు. జగన్‌కు చెందిన సాక్షి మీడియా కూడా .. జగన్ ఎంత గొప్పగా స్పందించారో కథలు కథలుగా చెప్పింది. అయితే ఇది జరిగి మూడు రోజులు కూడా కాలేదు. అప్పుడే అక్బర్ భాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది.
అటు సమస్య పరిష్కారం అయిపోయింది అక్బర్ భాషాతోనే చెప్పించిన తర్వాత అధికారులు మళ్లీ పాత రూట్లోకి వెళ్లిపోయారు. అసలు ఆ భూమి అక్బర్ భాషాది కాదనే వాదనను వినిపించడం ప్రారంభించారు. అధికారులు.. సీఎం బంధువుగా చెబుతూ..భూమిని తమ పేర రాయించుకున్న తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతూండంటంతో ఆ కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఇద్దరు కూతుర్లతో సహా అక్బర్‌బాషా దంపతులు పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు.
అక్బర్ భాషా కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ముస్లిం సంఘాలనేతలపై హత్యాయత్నం కేసు పెట్టడం కూడా రాజకీయంగా కలకలం రేపింది. సీఎం జోక్యం చేసుకున్నా న్యాయం జరగకపోవడంతో అక్బర్ భాషా కుటుంబం ఆత్మహత్యా ప్రయత్నం చేయడం రాజకీయంగానూ కలకలంరేపే అవకాశం ఉంది. అందుకే కర్నూలు, కడప ఎస్పీలు హుటాహుటిన ఆ కుటుంబం ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రాణాపాయం లేదని అంతా బాగుందని మీడియాకు చెప్పారు. న్యాయం చేశారని ప్రకటించిన తర్వాత ఇలా ఎందుకు జరిగిందో మాత్రం వారు చెప్పడం లేదు. కొత్తగా ఆ భూమి వాళ్లది కాదన్న వాదన వినిపిస్తున్నారు.