హైదరాబాద్: ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్ పలుసార్లు ప్రస్తావనకొచ్చింది. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రకటన, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన తర్వాత టీడీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రసంగించారు. ఈ ఉదయం ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన ఎర్రబెల్లి, లాభసాటి కాని సాగువల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నీరున్న సమయంలో ప్రభుత్వం కరెంట్ ఇవ్వటంలేదని, రైతన్న పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించటంలేదని చెప్పారు. ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు రాబడి సాధిస్తున్నట్లు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, తమ ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళితే తామూ ఆ వ్యవసాయం నేర్చుకుంటామని అన్నారు. అంతేకాక ఇక్కడే ఎకరాకు కోటిరూపాయలు వస్తుంటే అధ్యయనం కోసం చైనాకు, ఇజ్రాయెల్‌కు వెళ్ళటమెందుకని అన్నారు. ముఖ్యమంత్రి అంత రాబడి సాధించటంపై తమకూ సంతోషమని చెప్పారు. కేసీఆర్ ఆదర్శ రైతు అన్నారు. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫామ్‌హౌస్‌కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేస్తున్నపుడు కేసీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కనిపించారు.
మరోవైపు మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, రాష్ట్రంలోనేకాక సొంత నియోజకవర్గంలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన ఫామ్‌హౌస్‌లో చక్కగా టోపీ పెట్టుకుని తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రైతులంతా కేసీఆర్‌లాగానే టోపీలు పెట్టుకుని తిరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ ఫామ్హౌస్లాగా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ప్రభుత్వానికి చురకలంటించారు.