ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి పొగడ్తలు విని ఉండరనే చెప్పాలి! అదీ అసెంబ్లీలో ఆయన గురించి ఈ స్థాయిలో ప్రశంసలు వినిపించిన సందర్భాలు గతంలో పెద్దగా లేవనే అనాలి. ఎమ్.ఐ.ఎమ్. నేత అక్బరుద్దీన్ ఒవైసీ శాసనసభలో సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. గత సమావేశాలకు కాస్త భిన్నమైన ధోరణిలో ఆయన స్పందించడం విశేషం. గడచిన సభల్లో ఎక్కువగా ప్రజా సమస్యలపై చర్చకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన అక్బరుద్దీన్, ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రిని ఆకాశానికి ఎత్తే విధంగా మాట్లాడటం విశేషం.
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక మామూలు విషయం కాదనీ, ఎంతో వ్యూహాత్మకంగా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదన్నారు! సీఎం పదవికి మించిన స్థానం ఆయనకి దక్కాలని ఒవైసీ ఆకాంక్షించారు. తెలంగాణ ఇచ్చామని కొంతమంది చెప్పుకుంటున్నారనీ, అది అర్థం లేని వాదన అన్నారు. రాష్ట్రం ఇవ్వాల్సిన పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. ఉద్యమంలో మేమూ కలిసి పోరాడామని కొంతమంది నేతలు చెప్పుకుంటున్నా, వారు కూడా కలవాల్సిన పరిస్థితికి కారణం కేసీఆర్ అన్నారు. మజ్లిస్, టి.ఆర్.ఎస్. కలిసి 2019లో మరోసారి అధికారంలోకి రాబోతున్నాయన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే ఇతర పార్టీలు తుడిచిపెట్టుకుని పోయాయో, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి వస్తుందన్నారు.
ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో మోసేయడం గతంలో మజ్లిస్ చేయలేదు. నిజానికి, అధికారంలో ఏ పార్టీ ఉంటే వారితో సయోధ్యగా ఉంటూ పనులు చేయించుకోవడం మజ్లిస్ కు అలవాటు. అయితే, కేసీఆర్ సీఎం అయిన తరువాత మజ్లిస్ కు ప్రాధాన్యత బాగా పెంచారు. మైనారిటీలకు సంబంధించి ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ఆ పార్టీ నేతలతో సంప్రదించడం, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం చేస్తున్నారు. వారి మనోభావాలను దెబ్బతినే అంశాలైన సెప్టెంబర్ 17 లాంటివాటినే పక్కన పడేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వనంత ప్రాధాన్యత నిజాం నవాబుకు ఇస్తున్నారు. సో.. ఇవన్నీ మైనారిటీలను మరింత దగ్గరకు చేర్చుకునే అంశాలు. కాబట్టి, అక్బరుద్దీన్ ఇలా ఆకాశానికి ఎత్తారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మజ్లిస్ భవిష్యత్తు వ్యూహాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో గతంతో పోల్చితే తెరాస హవా పెరిగింది. ఇక్కడ తప్ప రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో మజ్లిస్ కు మరీ గట్టి పట్టేం లేదనే చెప్పాలి. ఇంకోపక్క, వారు కాంగ్రెస్ తో కలిసి వెళ్లే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. పోనీ… టీడీపీ ఉందా అంటే, అదీ లేదు. భాజపాతో ఆజన్మ శతృత్వం. కాబట్టి, తెరాసతో కలిసి సాగాల్సిన అవసరం ఆ పార్టీకీ ఉంది. సో.. కేసీఆర్ పై ఈ స్థాయి ప్రశంసల వెనక తెరాసతో వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి సాగుతామనే సంకేతాలు ఇస్తున్నారు!