అఖిల్ కెరీర్ ఏమైపోతుందో అనే బెంగ… అక్కినేని ఫ్యాన్స్ది. ఓ గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చి, చేతిలో అతి పెద్ద నిర్మాణ సంస్థ ఉండి కూడా అఖిల్ కెరీర్ సెటిల్ కాలేకపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, తనకు హిట్ అంటూ దొరకలేదు. అఖిల్ నుంచి కొత్త సినిమా కబురు వచ్చి కూడా చాలా కాలమైంది. యూవీ క్రియేషన్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడని, దాని బడ్జెట్ దాదాపు రూ.100 కోట్లని ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా గురించిన ఎలాంటి అప్డేటూ రాలేదు. ఆ సినిమా ఉంటుందా, లేదా? అనేది కూడా అనుమానమే.
అయితే ఆ సినిమా జనవరిలో ప్రారంభం అవుతుందని, ఈలోగా అఖిల్ మరో సినిమా చేయడానికి కూడా అంగీకరించాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు అఖిల్ ఓకే చేశాడని తెలుస్తోంది. నాగార్జునకీ ఈ కథ బాగా నచ్చిందని, అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారని, ఈ దసరాకు ఓ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్ తో పాటు ఈ సినిమానీ ఒకేసారి సమాంతరంగా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. యూవీ క్రియేషన్స్ కు సంబంధించిన కథ కూడా రెడీగా ఉంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ‘విశ్వంభర’ విషయం తేలేంత వరకూ యూవీ క్రియేషన్స్ సినిమా మొదలయ్యే ఛాన్స్ లేదు. ఈలోగా… అన్నపూర్ణ స్డూడియోస్ లో ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఆ తరవాత యూవీ సినిమా మొదలవుతుంది.