అఖిల్.. అన్నీ ఉన్నా ఏదో చెప్పలేని వెలితి. తన పూర్తి సామర్థ్యం ఇప్పటి వరకూ బయటకు రాలేదని అక్కినేని ఫ్యాన్సే చెబుతుంటారు. ‘ఏజెంట్’ సినిమా బాగా నిరాశ పరిచింది. ఆ దెబ్బకు చాలా కాలం కథలు వినలేదు. కొంత గ్యాప్ తీసుకొని ఓ సినిమా చేస్తున్నాడు. అదే ‘లెనిన్’. మురళీ కిషోర్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమాతో ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు అఖిల్ తో సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ రోజు అఖిల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గ్లింప్స్ విడుదల చేశారు.
రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. అఖిల్ లుక్ మాసీగా, రాగా ఉంది. రాయలసీమ యాసలో ఓ డైలాగ్ కూడా చెప్పారు. ”గతాన్ని తరమడానికి పోతా మా నాయన నాకో మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా. పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊరు ఉండదు. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే..” అనే డైలాగ్లో హీరో క్యారెక్టరైజేషన్ మొత్తం కనిపిస్తోంది. ఓ సంస్కృత శ్లోకంతో తమన్ ఇచ్చిన బీజియమ్… గూజ్ బమ్స్ ఇస్తున్నాయి. సాధారణంగా బాలయ్య సినిమా అంటే తమన్ ఆర్.ఆర్ తో రెచ్చిపోతాడు. ఈసారి అఖిల్ సినిమాకూ అంతే ప్రేమతో పని చేసినట్టు కనిపిస్తోంది. లాస్ట్ షాట్ లో శ్రీలీల దర్శనమిచ్చింది. ఇదో ప్రేమ కథ. అయితే దాన్ని యాక్షన్ నేపథ్యంలో మేళవించినట్టు కనిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లక్ బాగుంది. ఈ సంస్థ నుంచి వస్తున్న సినిమాలన్నీ ఆర్థికంగా మంచి ఫలితాల్ని అందుకొంటున్నాయి. ఆ లక్… అఖిల్ కీ కలిసొస్తే తన నుంచి ఫ్యాన్స్ ఆశిస్తున్న సినిమా ఇదే అవుతుంది.