అక్కినేని అఖిల్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకుడిగా, నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ – సుధాకర్‌రెడ్డి సంయుక్తంగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిర్మించిన సినిమా ‘అఖిల్’. ‘ది పవర్ ఆఫ్ జువా’ అనేది ఉపశీర్షిక. సయేషా సైగల్ కథానాయిక. అనూప్ రూబెన్స్-తమన్ సంయుక్తంగా సంగీతం అందించిన ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజైంది. మొదటి సీడీని అక్కినేని నాగార్జున ఆవిష్కరించి దర్శకుడు వి.వి.వినాయక్‌కి అందించారు. ఇదే వేదికపై సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కలిసి నాగార్జున థియేట్రికల్ ట్రైలర్‌ని ఆవిష్కరించారు. హైదరాబాద్ గచ్చిబౌళి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ ఆడియో ఆవిష్కరణ వేడుకలో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్, సయేషా, వి.వి.వినాయక్, నితిన్, నిఖితారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, నిర్మాతలు…. సి.కళ్యాణ్, పొట్లూరి.వి.వరప్రసాద్ (పీవీపీ), మహేష్ రెడ్డి, బండ్ల గణేష్, కె.ఎల్.నారాయణ, ఎం.ఎల్.కుమార్ చౌదరి, దర్శకుడు కొరటాల శివ, చలసాని రమేష్, మోనీ అగర్వాల్, కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, అనూప్ రూబెన్స్, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, ఏ.ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఆడియో వేడుకలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ -”ట్రైలర్ మైండ్‌బ్లోవింగ్. మనం సినిమా చూసినప్పుడు నాగార్జున గారికి ఫోన్ చేసి ‘సినిమా చాలా బావుంది సర్’. చివరి సెకన్లో అఖిల్ కనిపించినప్పుడు స్క్రీన్ మొత్తం వెలిగిపోయింది అని అన్నాను. అప్పుడు నాగార్జున గారు ఏమన్నారంటే.. సినిమా మొత్తం మేం కష్టిస్తే చివరి నిమిషంలో వచ్చి వాడు పేరు మొత్తం కొట్టేశాడు.. అని అన్నారు. అఖిల్ తెరపై టెర్రిఫిక్‌గా కనిపిస్తున్నాడు. తెలుగు సినీపరిశ్రమకి ఇంకొక పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్‌కి థాంక్స్. ఏఎన్నార్ అఖిల్లోనే జీవించి ఉన్నారు. తాత పేరు నిలబెట్టే మనవడు అఖిల్. ఈ సినిమాకి పనిచేసిన టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ”అఖిల్ తెరపై అంత బాగా కనిపిస్తున్నాడంటే అది వినాయక్, సుధాకర్ రెడ్డి వల్లే. టీమ్ కృషి ఫలించడం వల్లే. అఖిల్‌ని అందరూ తమ సొంత బిడ్డలా చూసుకున్నారు. అఖిల్‌కి ఆశీర్వచనాలు అందించిన అమితాబ్, సచిన్, కమల్ హాసన్ సహా పెద్దలందరికీ కృతజ్ఞతలు. కృష్ణగారితో కలిసి వారసుడొచ్చాడు చిత్రంలో నటించాను. కృష్ణ గారి వారసుడు నా వారసుడి ఆడియో చేసినందుకు థాంక్స్. స్టార్ హీరోలు యువతరాన్ని ప్రోత్సహించడం బావుంది. అలాగే అభిమానులతో 75 సంవత్సరాలు బంధం ఉంది. అఖిల్‌ని సునామీ కెరటంపై ఉంచి తీసుకెళ్తున్నారు. నాన్నగారు ఇక్కడే ఉన్నారు. మీ కేకల్లో, సంతోషంలో ప్రతిదాంట్లో ఆయన ఉన్నారు. మీ ఆనందంలోనే నాన్నగారిని చూసుకుంటాం. వినయ్, నితిన్, సుధాకర్ గారికి కృతజ్ఞతలు. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న సినిమా రిలీజ్ చేస్తున్నాం” అని అన్నారు.
దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ – ”చివరి వేడుకలో ‘ఏం మిగిల్చారు అఖిల్‌కి అంటే? వినాయక్‌ని మిగిల్చా అని అన్నారు. అది పెద్ద బాధ్యత. అక్కినేని కుటుంబానికి ఇచ్చిన ప్రామిస్.. నిలబెట్టుకుంటున్నా. అందరూ ఊహించినట్టే కచ్ఛితంగా అఖిల్ సూపర్‌స్టార్ అవుతాడు. నిర్మాత సుధాకర్‌రెడ్డి ప్రాజెక్టుకి వెన్నెముక. ఆయనే ధైర్యం. కష్టమైన వాతావరణంలో ఎంతో శ్రమించి సినిమా పూర్తి చేశాం. కోన, వెలిగొండ, రాథోడ్, రవివర్మ .. టీమ్ అంతా చాలా శ్రమించారు. అందరికీ ధన్యవాదాలు” అన్నారు. కథ గురించి చెబుతూ .. ఆఫ్రికాలో భూమధ్య రేఖ వద్ద జరిగే కథ ఇది. అక్కడ ట్రైబల్స్ సూర్యుడిని జువా అని పిలుస్తారు. అందుకే ది పవర్ ఆఫ్ జువా అని ట్యాగ్‌లైన్ పెట్టుకున్నాం. ఇక మొదటి నుంచి టైటిల్ అఖిల్ అనే అనుకున్నా. అందుకే ఖాయం చేశాం.. అని చెప్పారు వినాయక్.
నిర్మాత నితిన్ మాట్లాడుతూ – ”ఈ సినిమాకి నిర్మాత అన్న పేరు తప్ప నా కష్టం తక్కువ. ప్రధానంగా నాన్నగారే బ్యాక్‌బోన్. అక్క, నాన్న ఎంతో శ్రమించారు. ఇంత లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోని నిలబెట్టడమంటే మాటలా? నన్ను నా ఫ్యామిలీని నమ్మి అఖిల్‌ని లాంచ్ చేయమని అవకాశం ఇచ్చారు. అందుకే ఎంతో టెన్షన్‌కి గురయ్యా. నాలానే వినాయక్‌గారు ఎంతో టెన్షన్ పడ్డారు. ఆది సినిమాకి ఎంత టెన్షన్ అనుభవించారో అంతే టెన్షన్ ఆయనలో కనిపించింది. అభిమానులందరికీ నచ్చే హిట్ ఇస్తామని వినయ్, నేను ప్రామిస్ చేశాం. అది నిలబెట్టుకుంటాం. అనూప్, తమన్ చక్కని పాటలు ఇచ్చారు. ఇక అఖిల్ గురించి నిజాలు మాట్లాడాలంటే ఫీల్ అవుతాడేమో! నేను మొదటి సినిమా చేసేప్పుడు అంత పరిణతితో లేను. డెబ్యూ హీరోల్లో అఖిల్ మెచ్యూరిటీ సూపర్భ్. అంత మెచ్యూరిటీ తనలో చూశాను. డెడికేషన్‌తో కష్టించే స్వభావం ఉన్న హీరో. కెరీర్లో మొదటి పాటకు డ్యాన్సులు చేయాలి. అలాంటి టైమ్‌లో ముందు రోజు ఫైట్ తీస్తున్నప్పుడు కాలికి గాయం అయ్యింది. నొప్పి వేధిస్తున్నా పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఆ కమిట్మెంట్ ఇలానే కొనసాగితే అఖిల్ పెద్ద స్టార్ అవుతాడు” అని అన్నాడు.
అఖిల్ మాట్లాడుతూ – ”పోయిన జన్మలో ఏదో చేస్తేనే హీరోగా పుడతామని .. అంటుంటారు వినయ్. ఆయన ఎంతో ప్రేమని పంచారు. 8 నెలల క్రితం నానుంచి ఒక బ్లాక్‌బస్టర్ కావాలని అనుకున్నా. చీకటిలో ఉన్నప్పుడు సెర్చ్‌లైట్‌లా కనిపించారు వినయ్. ఆయన బంగారం. ఓ కొడుకుగా, తమ్ముడిగా నన్ను చూసుకున్నారు. నా ముఖంపై ఇబ్బంది అనేదే లేకుండా చేశారాయన. తర్వాతి సినిమా నాతోనే చేస్తానని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటారనే అనుకుంటున్నా. అనూప్, తమన్ సంగీతం అందించారు. పాటలకి అనూప్ లైఫ్ పోశాడు. ప్రతిసారీ ఫోన్ చేసి ఇంతకంటే బాగా పనిచేస్తానని అనేవాడు. డీఓపీ అమోల్ రాథోడ్ పనితనం సూపర్భ్. ఈసారి వినయ్‌ని తను ఓ కొత్త వ్యూలో చూపిస్తున్నాడు. రవివర్మ స్టంట్స్ హైలైట్. శేఖర్, జానీ, రఘు మాష్టర్ల కఠోర శ్రమ తెరపై ఫలిస్తుంది. ఇంతమంది శ్రమించి నన్ను నిలబెడుతున్నారు. అలాగే ఈ చిత్రానికి బ్యాక్‌బోన్ సుధాకర్‌రెడ్డి గారు. గుండె వినయ్ గారు. వీళ్లు ఉన్నారనే ధైర్యంగా చేశాను. ఇక నితిన్ నా దగ్గరికి వచ్చి ఈ సినిమా చెయ్ .. అంటూ అడిగాడు. నా కాలర్ పట్టుకుని చెయ్యరా బాబూ.. ! రా వినయ్‌తో ఓ సినిమా చెయ్ .. అన్నాడు. నాకొక కల ఉంది. అమ్మా, నాన్న అన్నయ్య అందరినీ పిలిచి ఇలా ఓ ఆడియో లాంచ్ చేయాలని. అది ఈరోజుతో నెరవేరింది. ఇది నా అదృష్టం” అని అన్నాడు.
నాగచైతన్య మాట్లాడుతూ – ”వేకువఝామున లేవగానే తాతగారితో స్పెండ్ చేసిన టైమ్ గుర్తొచ్చి బాధ కలిగింది. కానీ ఆడియోలో అభిమానుల్ని చూశాక సంతోషం కలిగింది. ఏఎన్నార్ లివ్స్ ఆన్. తాతగారు అక్కినేని అని స్టాంప్ వేసి వెళ్లారు. మీ సపోర్ట్‌తోనే ముందుకు తీసుకెళ్తున్నాం. అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు. తమ్ముడు సిసింద్రీగా పాకుతూనే హిట్ ఇచ్చాడు. మనంలో కొన్ని సెకన్ల వాక్‌తోనే మైమరిపించాడు. అఖిల్ సినిమాలో మేం అందరం చేయలేనిది చేసి చూపిస్తాడు. సల్మాన్ బాలీవుడ్లో టీజర్ లాంచ్ చేసినప్పుడు బాలీవుడ్ టీజర్లానే ఉంది. వినాయక్ వంటి దర్శకుడు అఖిల్‌ని లాంచ్ చేసినందుకు కృతజ్ఞతలు. అక్టోబర్‌లో అన్ని పండగలు వదిలేసి అఖిల్ పండగ చేసుకోండి” అన్నాడు.
నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ -”ఒక యువ హీరోని ఎంకరేజ్ చేసిన మహేష్ గొప్ప మనసు నచ్చింది. నితిన్ ఒక హీరో అయి ఉండీ, వేరే హీరోని పరిచయం చేయడం ఇంకా బావుంది. నాగార్జున కుటుంబంతో చక్కని అనుబంధం ఉంది. అఖిల్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. సినిమా పెద్ద విజయం సాధించాలి” అన్నారు.
కె.ఎల్.నారాయణ మాట్లాడుతూ – ”హలో బ్రదర్ చిత్రాన్ని పూర్తి చేసినప్పుడు అఖిల్ పుట్టాడు. అప్పుడు నాగార్జున అమెరికా వెళ్లాడు. ఆ సంగతి మర్చిపోలేనిది. అఖిల్ పెద్ద హీరో కావాలి” అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ – ”రాజమౌళి టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ తీసుకెళ్లాడు. వినాయక్ హాలీవుడ్ హీరోని టాలీవుడ్ తీసుకొస్తున్నాడు. ఈ హాలీవుడ్ హీరో టాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. అఖిల్ డ్యాన్సులు సూపర్భ్. అక్టోబర్ లో అభిమానులకు పండుగే. వినయ్ తెలుగు సినిమా దర్శకులందరిలో మంచి మనిషి. కష్టంలో ఆదుకునే మనిషి. అక్కినేని అభిమానులు గర్వంగా చెప్పుకునే హీరో అవుతాడు అఖిల్” అని అన్నారు.
సుమంత్ మాట్లాడుతూ – ”అఖిల్ సూపర్‌స్టార్ అయ్యే కంటే ముందే సూపర్‌స్టార్. తనపై చాలా ఒత్తిడి ఉంది. అక్కినేని లెగసీని, వారసత్వాన్ని నిలబెడుతూ దూసుకుపోతాడు. అలాగే తాతగారి పుట్టినరోజున అఖిల్ ఆడియో చేయడం బావుంది. అక్కినేని అభిమానులకు పండుగే. అఖిల్‌కి తాత ఆశీస్సులు ఎల్లపుడూ ఉంటాయి. తాతకు మహేష్ అంటే ఇష్టం. నాకు కృష్ణ గారంటే ఇష్టం. పైనుంచి తాత సంతోషిస్తూనే ఉంటారు” అన్నారు.
సి.కళ్యాణ్ మాట్లాడుతూ – ”అఖిల్ సినిమాని తమిళ్లో రిలీజ్ చేస్తున్నా. అక్కడ ఇంతకంటే ఘనమైన ఆడియో వేడుకనే చేస్తాను. అఖిల్ హాలీవుడ్ హీరో కంటే మెరుపులా కనిపిస్తాడు. అక్కినేని ఆశీస్సులు తనకి ఉంటాయి. వినయ్‌ని నమ్మి తనకి అప్పగించినందుకు నాగార్జున నమ్మకం నిలబెడతాడు” అన్నారు.
సుశాంత్ మాట్లాడుతూ -”సీసీఎల్‌లో క్రికెట్ బాగా ఆడి గెలిపించాడు. అప్పుడే సూపర్ హిట్ కొట్టినట్టు అనిపించింది. తాత, నాన్న సూపర్‌స్టార్స్. వారికి వారసుడిగా సూపర్హిట్లు కొడతాడు అఖిల్” అన్నారు.
అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ -”నాతో పాటు ఫ్యాన్స్ అందరికీ అకిల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. ఊహని మించి నటించాడు” అన్నారు.
సయేషా మాట్లాడుతూ – ”అఖిల్ నటించిన సీన్స్, ఫైట్స్, డ్యాన్సులు అన్నీ సూపర్భ్. అఖిల్‌తో పనిచేయడం ఫెంటాస్టిక్ ఎక్స్‌పీరియెన్స్. తెలుగు మాట్లాడడానికి అఖిల్, వినాయక్ నా గురువులు. వినయ్త పనిచేయడం నా అదృష్టం. అఖిల్ ఎంతో హార్డ్ వర్కర్. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ శ్రమించారు. తెలుగులో అఖిల్ సరసన డెబ్యూగా వస్తున్నందుకు నా కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉన్నారు” అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు:
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, హేమ, లెబాగా జీన్ (లండన్), లూయిస్ పాస్కల్, ముతినే కెల్లూన్, గిబ్సన్ బైరన్ జేమ్స్ (రష్యా) తదితరులు నటిస్తున్నారు. కోన వెంకట్, వెలిగొండ శ్రీనివాస్, ఏ.ఎస్.ప్రకాష్, తమన్, అనూప్ రూబెన్స్, అమోల్ రాధోడ్, రవివర్మ, భాస్కరభట్ల, కృష్ణ చైతన్య, శేఖర్, గణేష్, జానీ తదితర సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్.వెంకట రత్నం (వెంకట్), సమర్పణ: నిఖితారెడ్డి, నిర్మాత: నితిన్, స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: వి.వి.వినాయక్.
ఏవీల్లో ప్రముఖుల ప్రశంసలే ప్రశంసల, గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న అక్కినేని మిసైల్ అఖిల్‌కి ప్రముఖులు ఆశీస్సులు అందించారు. ఆ ఏవీ(యాంకర్ విజువల్స్)ల్ని అఖిల్ ఆడియో వేడుకలో అహూతులకు ప్రదర్శించారు. ఈ విజువల్స్‌లో ఎవరేమన్నారంటే….
అమితాబ్:
అఖిల్ మీ తాతగారి పుట్టినరోజున నీ ఆడియో వస్తోంది. ఆయన ఆశీస్సులు నీకు ఉన్నాయి. ఆయన లెగసీని కొనసాగించడం నీ బాధ్యత. నటనలో మంచి శిక్షణ పొందావు. లాస్ ఏంజిల్స్‌లో అన్నీ నేర్చుకుని మొదటి ప్రయత్నం చేస్తున్నావ్. నిరూపించుకో.. ఆల్ ది బెస్ట్.
సచిన్ :
అక్కినేని నటవారసుడు అఖిల్‌కి ఆల్ ది బెస్ట్. ఏఎన్నార్, నాగార్జున తనయుడిగా మంచి పేరు తేవాలి.
కమల్‌హాసన్:
అక్కినేని ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ వంశం నుంచి నాగార్జున అమెరికా వెళ్లి ట్రైనింగ్ అయి వచ్చారు. అఖిల్ కూడా అదే చేశాడు. ఏదో డాడీ సన్‌గా రాలేదు ఇక్కడికి. ప్రత్యేకించి శిక్షణ పొంది వచ్చావు. లెగసీని కొనసాగించు. నీకోసం వేచి చూస్తున్నాం అంతా. ఆల్ ది బెస్ట్.
సూర్య:
క్రికెట్లో మెరిపించావ్. అక్కడ ప్రాక్టీస్ చేసినట్టే నటుడిగా ప్రాక్టీస్ సాగించు. కెమెరా ముందుకి వెళ్లే ముందే ప్రాక్టీస్ చేసి వెళ్లాలి. ఏఎన్నార్, నాగార్జునల తర్వాత మూడో జనరేషన్ స్టార్‌గా ఎదగాలి. ఆల్ ది బెస్ట్.
వెంకటేష్:
అఖిల్ యు రాకింగ్. ఆల్ ది బెస్ట్. తాత, డాడీ పేరు నిలబెడతావ్.
రామ్‌చరణ్ :
మొదటి ప్రయత్నమే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్‌తో పనిచేస్తున్నావ్. అదృష్టవంతుడివి. తాత, నాన్న .. వీళ్ల లెగసీని నువ్వు తీసుకున్నావ్. దానిని నిలబెట్టాలి. వినయ్, తమన్, అనూప్ .. అందరికీ ఆల్ ది బెస్ట్.
ప్రభాస్:
అఖిల్ నీ స్టిల్స్ చూశాను. యాక్షన్ చూశాను. పాటలు చూశాను. చాలా గ్రేస్ ఉంది. ఆల్ ది బెస్ట్.
త్రివిక్రమ్:
అసలు కంటే వడ్డీ ముఖ్యం. నాగార్జున అసలు అయితే అఖిల్ వడ్డీ. టీజర్ చూస్తే ఒక సూపర్‌స్టార్‌ని చూస్తున్నా అనిపించింది.
రానా:
ఏఎన్నార్, నాగార్జున తర్వాత ఆ లెగసీని నువ్వే కొనసాగించాలి. గుడ్ లక్. రాకింగ్ అఖిల్.
అల్లు అర్జున్ :
అఖిల్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ మంచితనం నచ్చుతుంది. తాత, నాన్నలా పెద్ద ఎత్తుకు ఎదగాలి. ఆల్ ది బెస్ట్.
శివరాజ్‌కుమార్ :
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున .. ఫ్యాన్స్‌ని అలరించేలా నటించాలి. ఒక గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చావు. నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. మా తండ్రిగారు, మీ తాత గారు గొప్ప స్నేహితులు. పేరు నిలబెట్టు. ఆల్ ది బెస్ట్.
లక్ష్మి ప్రసన్న:
అఖిల్ మంచి స్వమ్మర్. నీటిలో మిసైల్. ఏ పని చేసినా అతడు 100శాతం చేస్తాడు. పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. లాస్ ఏంజిల్స్‌లో ఎంతో హార్డ్‌వర్క్ చేశాడు. అది నేను కనులారా చూశాను. వినాయక్ నాకు ఇష్టమైన దర్శకుడు. పెద్ద విజయం సాధించాలి. ఆల్ ది బెస్ట్.
కాజల్, శ్రుతిహాసన్: అఖిల్ ఏఎన్నార్, నాగార్జున .. పేరు నిలబెట్టాలి. అఖిల్, సయేషా, నితిన్ అందరికీ ఆల్ ది బెస్ట్.