దేవదాసు మనవడు
మన్మథుడు వారసుడు.. అక్కినేని అఖిల్.
అయితే అఖిల్ తొలి అడుగులు అంత సవ్యంగా ఏమీ పడడం లేదు. అఖిల్‌తో తొలి ఫ్లాప్ తగిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న `హలో` కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రయత్నం చేస్తున్నాడు అఖిల్. అదే `మిస్టర్ మజ్ను`. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కాబోతోంది. ఈసందర్భంగా అఖిల్ తో చిట్ చాట్.
మూడో సినిమాకి వచ్చేశారు.. గత రెండు సినిమాలతో పోలిస్తే ఈ అనుభవం, ప్రయాణం ఎలా ఉంది?
అఖిల్ సమయంలో చాలా ఒత్తిడి ఉండేది. `హలో`కి ఇంకాస్త పెరిగింది. ఎలాగైనా హిట్టుకొట్టాలన్న కసితో పనిచేశాం. పైగా సొంత నిర్మాణ సంస్థలో తీసిన సినిమా. అందుకే ఆ ఒత్తిడి డబుల్ అయ్యింది. ఈసారి అలా కాదు. ఓ సినిమాని సినిమాలా చూస్తూ చేశాం. ఇదే నా తొలి సినిమా ఏమో అనే ఫీలింగ్ కలుగుతోంది.
ఈ కథ వెంకీ అట్లూరి మీ కోసమే రాశాడట..
అవును. నాతొలి సినిమా కోసం విన్న కథల్లో ఇదొకటి. `నీ కోసమే రాశా. నీతోనే తీస్తా` అనేవాడు. నా కోసం ఇన్నేళ్లు ఆగాడు.
ఇద్దరూ మంచి స్నేహితులట.. నిజమేనా?
తను నాకు పదేళ్ల నుంచీ తెలుసు. కాకపోతే మరీ క్లోజేం కాదు. ఈసినిమాతో మాత్రం మంచి మిత్రులం అయిపోయాం.
ఈ కథలో ఏం నచ్చింది?
ఇదో ప్యూర్ లవ్ స్టోరీ. నా పాత్ర ని తెరకెక్కించిన విధానం బాగుంటుంది. మజ్ను లవ్ స్టోరీనే అయినా తొలి 20 నిమిషాల వరకూ ప్రేమకథ ఉండదు. నా పాత్ర ని పరిచయం చేయడానికి ఆ 20 నిమిషాలూ వాడుకున్నాడు. ఆ సన్నివేశాలన్నీ నాకు బాగా నచ్చాయి.
మీ వయసుకి తగిన పాత్ర ఇది.. ఇక మీదట ప్రేమకథలే చేస్తారా?
నాకైతే అన్ని జోనర్లు చేయాలనివుంది. దాంతో పాటు ప్రేమకథలు చేయాలి. నా వయసు చాలా చిన్నది కదా..
మరో 5 ఏళ్ల పాటు ఇలాంటిక థలు చేస్తూనే ఉంటా.
మజ్ను అనే టైటిల్ మీ కుటుంబానికి సెంటిమెంట్‌గా మారిందా?
తాతగారికీ నాన్న గారికీ హిట్ ఇచ్చిన టైటిల్ ఇది. నాక్కూడా హిట్ వస్తుందని ఆశ పడుతున్నాను. వెంకీ అట్లూరి అక్కినేని ఫ్యాన్. కాబట్టి ఈ టైటిల్‌ని బాగా ప్రేమించాడు. ప్రేమ్ నగర్‌లోని తాతగారి డైలాగ్‌ని పనిగట్టుకునివాడాడు.
మీ నిజ జీవిత ప్రేమకథకీ ఈ సినిమాలో చోటిచ్చారని తెలుస్తోంది..?
అలాంటిదేం లేదు. నా రియల్ లైఫ్‌లో నేను మజ్నుని కాదు. నా చుట్టూ ఇంత మంది అమ్మాయిలు ఉండరు. అబ్బాయిలే ఎక్కువగా కనిపిస్తారు.
ఈ సినిమా కోసం 8 ప్యాక్ చేశారు. కారణమేంటి?
ఓ పాట ప్రత్యేకంగా ఉండాలనుకున్నాను. ఏం చేస్తే బాగుంటుంది? అనుకున్నప్పుడు శేఖర్ మాస్టర్ ఈ ఐడియా ఇచ్చారు. అందుకోసమే 8 ప్యాక్ చేశాను. ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉంటుంది. వెంకీ అట్లూరి తన తొలి సినిమా తొలి ప్రేమని యాక్షన్ ఏం లేకుండా చేశాడు. ఈసారి కొత్తగా ప్రయత్నించాలన్న ఉద్దేశంతో యాక్షన్‌కీ చోటిచ్చాడు.
మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. మీరూ ఆ దిశగా అడుగులేస్తారా?
తప్పకుండా.. నాక్కూడా అలాంటి సినిమాల్లో చేయాలనివుంది. అయితే ఇద్దరు ముగ్గురు హీరోలు కాదు. ఐదారుమంది హీరోలున్నా బాగుంటుంది. నేర్చుకోవడానికి ఎక్కువ వీలు దక్కుతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు చేయమన్నా చేస్తా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అలాంటిసినిమాలతో ఈజీగా కనెక్ట్ అయిపోతా. కాకపోతే కథలు, తీసే విధానం సాధికారికంగా ఉండాలి.
తొలి రెండు సినిమాలూ సరిగా ఆడలేదు. ఆ పరాజయాల నుంచి ఎలా బయటపడ్డారు?
ఎన్టీఆర్ చెప్పినట్టు.. నన్ను నేను ఆత్మ విమర్శ ఎక్కువగా చేసుకుంటా. తప్పుల నుంచి నేర్చుకుంటా. తొలి సినిమాతో ఇంకా చాలా ఎక్కువ నేర్చుకున్నా. స్టార్ హీరోలకు ఓ ఫ్లాప్ వస్తే అందులోంచి తేరుకోవడానికి చాలా టైమ్ పడుతుంది.
నేనేం స్టార్‌ని కాదు. కాబట్టి తట్టుకోగలిగా. తొలి సినిమాకే అంత పెద్ద ఫ్లాప్ రావడం మంచిదైంది. నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా. రెండో సినిమా చేసేటప్పుడు ఆత్మవిశ్వాసం పాళ్లు కూడా పెరిగాయి.
మీ అమ్మాన్నాన్నల సపోర్ట్ ఎంత వరకూ ఉంది?
నాన్నే నాకు అన్ని. ఈతరం సినిమాల గురించి నాన్నకు బాగా అవగాహన ఉంది. ఎలాంటి కథలు ఎంచుకొంటే బాగుంటుందో సలహా ఇస్తారు. అమ్మకి సినిమా పరిజ్ఞానం తక్కువ. కానీ మోరల్‌గా తన సపోర్ట్ నాకెప్పుడూ ఉంటుంది.
తరవాతి సినిమా ఎప్పుడు?
రెండు మూడు కథలున్నాయి. అయితే ఎవరితో చేస్తానన్నది ఫిబ్రవరిలో ప్రకటిస్తా. సంవత్సరానికి రెండు సినిమాలు చేయాలనివుంది. ఇక మీదట స్పీడు పెంచుతా.