ఒక్క సినిమా చేశాడో లేదో.. అప్పుడే పెళ్లి వైపు మనసు లాగేసింది అఖిల్‌కి. అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న వార్త.. టాలీవుడ్‌కి షాకిచ్చింది. జీవీకె రెడ్డి మనవరాలు, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రియభూపాల్ తో అఖిల్ పెళ్లి నిశ్చయమైపోయింది. ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిపోయిందని, పెళ్లొకటే బాకీ అని వార్తలొచ్చాయి. నాగార్జున రంగంలోకి దిగి.. ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చాడు. నిశ్చితార్థం జరగలేదని, అందుకోసం ముహూర్తం చూస్తున్నామని తేల్చి చెప్పాడు. దాంతో శ్రియ భూపాల్‌తో పెళ్లి ఖాయమన్న విషయం స్పష్టమైంది. అయితే అఖిల్ ఇప్పుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. నిశ్చితార్థం చేసుకొంటాగానీ, పెళ్లికి ఇంకాస్త టైమ్ కావాలని ట్విస్ట్ ఇచ్చాడు.
అన్నయ్య నాగచైతన్య పెళ్లికి రంగం సిద్ధమవ్వడంతో.. అఖిల్ కాస్త టైమ్ తీసుకోవాలని భావిస్తున్నాడట. అంతేకాదు.. తన ఖాతాలో ఓ హిట్టు పడిన తరవాతే పెళ్లి చేసుకొంటే బెటర్ అన్నద అఖిల్ ఆలోచన. తొలి సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. కాస్త ఇరకాటంలో పడ్డాడు అఖిల్. రెండో సినిమా ఇంకా మొదలవ్వలేదు. కెరీర్ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని సన్నిహితులు సలహా ఇచ్చారట. దాంతో ముందు నిశ్చితార్థం చేసుకొని, పెళ్లికి కనీసం ఒక్క యేడాదైనా టైమ్ తీసుకోవాలనుకొంటున్నాడట. మరోవైపు శ్రియ కూడా కాస్త టైమ్ కావాలని అడగడంతో… అఖిల్ పెళ్లి ఆలస్యం అవుతోంది. రెండో సినిమా పూర్తయి బయటకు వచ్చాకే అఖిల్ పెళ్లి జరుగుతుందని అక్కినేని కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి.