దర్శకుడిగానే కాదు, అప్పుడప్పుడూ నిర్మాతగా, రచయితగానూ తన మార్క్ చూపిస్తున్నాడు సుకుమార్. `కుమారి 21 ఎఫ్`కి తనే కథ అందించాడు, నిర్మాణ భాగస్వామిగా మారాడు. ఇప్పుడు మరోసారి తన కథని మరో దర్శకుడి చేతుల్లో పెట్టబోతున్నట్టు సమాచారం. ఈసారి ఈ కథ అఖిల్ దగ్గరకు చేరిందని తెలుస్తోంది. అఖిల్ ని కథానాయకుడిగా లాంచ్ చేస్తున్నప్పుడు చాలామంది దర్శకుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అందులో సుక్కు ఒకడు. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదు. ఇప్పుడేమో సుకుమార్ రేంజు పెరిగిపోయింది. అఖిల్‌కి సుక్కు దొరకడం కష్టం. కాకపోతే… తన కథతో అఖిల్ హీరోగా ఓ సినిమా తీసే అవకాశం ఉందని, దీనికి సుకుమార్, నాగార్జున నిర్మాతలుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. అయితే దర్శకుడు ఎవరన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతం వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. అది పూర్తయిన వెంటనే… సుకుమార్ కథ పట్టాలెక్కే ఛాన్సుంది. ఈలోగా మిగిలిన వివరాలు తెలుస్తాయి.