డిసెంబరు 9న అఖిల్ నిశ్చితార్థం జరపడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. జీవీకే మనవవరాలు శ్రియా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్థం జరగబోతున్న సంగతి తెలిసిందే. జీవీకే ఇంట్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని ఇరు కుటుంబాల వాళ్లు నిర్ణయించుకొన్నారు. అయితే ఈ వేడుకకు చాలా తక్కువ మంది అతిథులకే ఆహ్వానాలు అందాయని సమాచారం. నాగ్ కుటుంబానికి అత్యంతముఖ్యులైన సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన వ్యక్తులే ఈ నిశ్చితార్థ వేడుకలకు హాజరవుతారని తెలుస్తోంది. అంతా పోగేస్తే అతిథుల సంఖ్య 40 నుంచి 50 వరకే ఉంటుందని తెలుస్తోంది. పెళ్లి కూడా ఇటలీలో చేసుకోబోతున్నాడు. దానికీ తక్కువమందే హాజరవుతారు. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేయాలని నాగ్ భావిస్తున్నాడట.
ఈ విషయమై నాగార్జున సన్నిహిత వర్గాలు తెలుగు 360తో మాట్లాడుతూ ”నిశ్చితార్థం గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అయితే అతి ముఖ్యమైన వాళ్లకు మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇటలీలో జరిగే అఖిల్ పెళ్లికీ.. తక్కువమందే హాజరవుతారు. పెళ్లి విందు మాత్రం హైదరాబాద్లో జరుపుతారు. ఆ విందుకు సినీ, రాజకీయ ప్రముఖులంతా విచ్చేస్తారు. అక్కినేని అభిమానుల్నీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తార”ని చెప్పాయి. అఖిల్ పెళ్లి ఆగస్టులో చేసే అవకాశాలున్నాయి. ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారని సమాచారం.