ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టవడానికి కారణమైన కిడ్నాప్ స్కెచ్… అనంతర సంచలన ఘటనల కేంద్ర స్థానం హాఫిజ్ పేట భూములు. ఆ భూములు మావని భూమా కుటుంబసభ్యులందరూ చెబుతున్నారు. తమ తండ్రికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించిన ఏవీ సుబ్బారెడ్డితో కలిసి ప్రవీణ్ రావు సోదరులు ఆ భూమిని తమకు కాకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ స్థలం ఏమిటి..? దీని వెనుక ఉన్న లావాదేవీలేమిటి..? అన్న విషయాలను పక్కన పెడితే.. అసలు ప్రస్తుతం ఆ భూముల్లో ఎవరు ఉన్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ భూములు నిరుపయోగంగా ఏమీ లేవు. అక్కడకు వెళ్తే పెద్ద ఎత్తున కట్టడాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఓ వైపు ఖాళీ స్థలం..మరో వైపు నిర్మాణాలు జరుగుతున్నాయి. అవి వివాదాస్పద భూములా.. ప్రైవేటు భూములా అన్నదానిపై స్పష్టత లేదు.
భూమా అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, సోదరి మౌనిక నిన్న విడివిడిగా మీడియా ముందుకు వచ్చారు. వారు చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుతం ఆ భూములు… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులపైన జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మైహోమ్ గ్రూప్ అధీనంలో ఉన్నాయి. కిడ్నాప్‌కు గురైన ప్రవీణ్ రావు సోదరులు.. వాటిని తమ పేరుపై మార్పించుకోవడమే కాదు.. మైహోమ్ గ్రూప్‌కు లీజుకో.. డెవలప్‌మెంట్‌కో ఇచ్చారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో మైహోమ్ ఉందని… జగత్ విఖ్యాత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే వారు.. సీఎంకేసీఆర్ తమకు న్యాయం చేయాలని వారు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
మరో వైపు ఈ కేసు విషయంలో మైహోమ్ పేరు మెల్లగా తెరపైకి వస్తూండటంతో.. బీజేపీ నేతలూ రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లో జరుగుతున్న భూదందాలు.. గొడవల వెనుక ఉన్నది… కేసీఆర్ కుటుంబమేనని.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వారు భూముల్ని కబ్జా చేస్తున్నారని ఆరోపణలు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో బయటకు రాని అంశాలు చాలా ఉన్నాయన్న చర్చ మాత్రం నడుస్తోంది. రెండు వర్గాల మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని… భూమా కుటుంబం అంగీకరించేలా చేయడానికి.. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మిగిలిన అఖిలప్రియ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం.. వారి వర్గంలో ఏర్పడింది.
అయితే.. అసలు మొత్తం ఈ భూవివాదంో ఏం జరిగిందో.. ప్రజలకు మొత్తం తెలిస్తేనే.. ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో నిర్ణయం అవుతుంది. వారికి వారు రాజీ చేసుకోవడమో.. లేకపోతే.. బలవంతంగా అధికారాన్ని ఉపయోగించి… తేల్చేయడమో చేస్తే..కొన్ని సీక్రెట్స్ మరుగున పడిపోతాయి. దాని గురించి ప్రభుత్వమే పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఎందుకంటే.. ఆ భూములపై ఇప్పటికే అనేక ఘర్షణలు.. హత్యలు జరిగాయని పోలీసులు కూడా చెబుతున్నారు మరి..!