సీఎం కేసీఆర్ బంధువులు ప్రవీణ్ రావు సోదరులకు జాక్ పాట్ తగిలింది. హఫీజ్ పేట భూముల విషయంలో హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అక్కడి భూములు ప్రభుత్వ భూములు కావని ప్రైవేటు వ్యక్తులవేనని హైకోర్టు నిర్ధారించింది. అంతే కాదు.. పిటిషనర్లకు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించింది. దీంతో యాభై ఎకరాలపై హక్కులు ప్రవీణ్ రావుతో పాటు అతని సహ యజమానులకు దక్కుతాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్తుందా.. అక్కడ ఏ తీర్పు వస్తుంది.. స్టే వస్తుందా.. అన్న విషయాలను పక్కన పెడితే ఇప్పటికైతే ఆ భూవివాదం పరిష్కారం అయినట్లుగానే చెప్పుకోవచ్చు.
కొద్ది రోజుల కిందట ప్రవీణ్ రావు అతని సోదరుల్ని భూమా అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్ చేశారు. ఇది సంచలనం సృష్టించింది. దీనికి కారణం… హఫీజ్ పేట భూముల వ్యవహారమేనని తేలింది. ఈ కేసులపై పోలీసులు హైపర్ యాక్టివ్ నెస్ ప్రదర్శించారు. రోజువారీ ప్రెస్మీట్లు పెట్టి అప్ డేట్స్ ప్రకటించారు. అఖిలప్రియను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కానీ హఠాత్తుగా ఈ కేసుపై దృష్టి తగ్గించారు. చివరికి పరారీలో ఉన్న వారిని ఎవరినీ పట్టుకోలేదు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను కూడా కోర్టులో పెద్దగా వ్యతిరేకించలేదు. దాంతో అఖిలప్రియకు బెయిల్ వచ్చింది.. ఆ తర్వాత మిగతా వారు అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్పై బయటనే తిరుగుతున్నారు.
ఈ ల్యాండ్ విషయంలో గతంలోనూ సెటిల్మెంట్కు ప్రయత్నాలు జరిగాయని ప్రచారం జరిగింది. అలా.. కేసు నమోదైన తర్వాత సెటిల్ చేసుకున్నారని అంటున్నారు. అందుకే ఈ భూముల విషయంలో పరిణామాలు వేగంగా జరిగిపోతున్నాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రవీణ్ రావు సోదరులు ఆ భూమిని.. ప్రముఖ సిమెంట్, నిర్మాణ రంగ సంస్థకు డెవలప్మెంట్కు ఇచ్చేశారు. ఆ సంస్థ అక్కడ నిర్మాణాలు ప్రారంభించింది. ఈ క్రమంలో అక్కడ మొత్తం వివాదాలు సెటిల్ చేసుకునే ప్రయత్నంలోనూ ప్రస్తుతం అన్నీ వేగంగా జరుగుతున్నాయంటున్నారు. ప్రభుత్వానికి కాదని.. హైకోర్టు తీర్పు ఇస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లకపోతే విమర్శలు వస్తాయి కాబట్టే.. సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించిందనేది చాలా మంది అభిప్రాయం.