నంద్యాల రాజకీయం రానురానూ మరింత వేడెక్కుతోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ తరువాత అధికార పార్టీ నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నేతలు మండిపడుతున్నారు. ‘చంద్రబాబు నాయుడు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు, ఇటువంటి వ్యక్తిని నడిరోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పులేదు అనిపిస్తా ఉంది’ అని జగన్ తీవ్ర పదజాలంతో మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విమర్శించడంతోపాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. తమ ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత జగన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎన్నికల కమిషన్ కు మంత్రి భూమా అఖిల ప్రియ ఫిర్యాదు చేశారు. నంద్యాల బహిరంగ సభలో తమ పార్టీ అధినేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని పరిగణనలోకి తీసుకుని, జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఆమె రిటర్నింగ్ అధికారిని కోరారు.
ఈ ఫిర్యాదుతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. నిజానికి, ఇప్పటికే టీడీపీ నేతలందరూ వరుసగా జగన్ పై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఫ్యాక్షన్ నైజాన్ని ఆయన వదులుకున్నట్టు లేదంటూ పయ్యావుల కేశవ్ విమర్శించారు. అదే నైజాన్ని అనుక్షణం, అనునిత్యం, అన్ని సందర్భాల్లోనూ ఉపయోగించుకోవాలనే జగన్ చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఆయన తీరుకు మారలేదంటే, ఇంకెన్ని జైళ్లకు పంపించాలో అర్థం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఆయన దేనికైనా తెగించగలడనీ, ఎవ్వర్నైనా వదులుకోగలడని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యల్ని సుమొటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిని చంపెయ్యాలని వ్యాఖ్యానించడం తప్పు అని రాయపాటి హితవు పలికారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ పై వెంటనే చర్యలు తీసుకుని, అరెస్టు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీ మీద ఉందని ఆయన చెప్పారు.
జగన్ వ్యాఖ్యల్ని కేవలం ప్రతివిమర్శలతో సరిపెట్టే ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓ పక్క ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరోపక్క, ఈ కేసును సుమొటోగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతి భద్రతల కోణం నుంచి డీజీపీ స్పందించాలని కూడా అధికార పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్ధం ఉందనేది అర్థమౌతోంది. మొత్తానికి, జగన్ పర్యటనతో నంద్యాల వైకాపా వర్గాల్లో కొత్త ఊపు వచ్చిందని అనుకుంటున్న ఈ తరుణంలో, ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కొత్త సమస్య తెచ్చి పెట్టేట్టుగానే ఉన్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. భూమా అఖిల ప్రియ ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందన ఎలా ఉండనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.