ఏపీలో, యూపీలో అదే సీన్. 1995లో అధికార తెలుగు దేశం పార్టీలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. మామ ఎన్టీఆర్ ఒక వైపు, అల్లుడు చంద్రబాబు నాయుడు మరోవైపు సైకిల్ గుర్తు కోసం పోరాడారు. చివరకు అల్లుడికే సైకిల్ గుర్తు దక్కింది. అది ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన రాజకీయ పరిణామం.
ఇప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలోనూ రాజకీయ సంక్షోభం ఏర్పడింది. తండ్రి ములాయం సింగ్ యాదవ్, తనయుడు అఖిలేష్ యాదవ్ లు సైకిల్ గుర్తుకోసం పోరాడారు. చివరకు తనయుడికే సైకిల్ దక్కింది.
ఏపీలో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు. ఆయన పార్టీ పెట్టే సమయానికి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో ఉన్నారు. యూపీలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. ఆయన పార్టీ పెట్టే నాటికి అఖిలేష్ స్కూల్లో విద్యార్థిగా ఉన్నాడు.
ఇరవై ఏళ్ల నాడు తెలుగు దేశంలో ముసలం పుట్టిన సమయంలో జయప్రద చంద్రబాబు వైపు ఉన్నారు. ఇప్పుడు యూపీలో అలాంటి ముసలం పుట్టినప్పుడు ఆమె రాజకీయ గురువు అమర్ సింగ్ తో పాటు ములాయం వైపు ఉన్నారు. అదే విశేషం.